పాలకుర్తి రూరల్, జూలై 17: తాను బీఆర్ఎస్ను వీడుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, కావాలనే కొందరు సోషల్ మీడియా, యూట్యూబ్, వాట్సాప్ గ్రూప్‌ల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తిలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ సీఎంగా కేసీఆర్ అధికారంలోకి వస్తారని చెప్పారు. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు. వానకాలం పంట పెట్టుబడి సాయం అందక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నదన్నారు.
దీంతో రైతులు అప్పులపాలవుతున్నారని ఆయన తెలిపారు. పంట రుణాల మాఫీపై కాంగ్రెస్ పాలకులు కొర్రీలు పెడుతున్నారని వివరించారు. తొలుత రూ.2 లక్షల రుణమాఫీ అని చెప్పి నేడు రూ.లక్ష మాఫీ చేస్తానమని ప్రకటించడం హస్యాస్పదంగా ఉందన్నారు. అర్హత కలిగిన ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింప చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారని తెలిపారు.. హామీలను నేరవేర్చే వరకు ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడుతామన్నారు. ఇందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తొలి ఏకాదశి, మొహర్రం పండుగల సందర్భం గా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి, వర్థన్నపేట నియోజకవర్గాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్‌రావు, బీఆర్ఎస్ మం డల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, రంగనేని సత్యనారాయణరావు, ఎన్నకూస యాకయ్య, బత్తిని గోపాల్, గర్వందుల మల్లేశ్, బెల్లి సోమయ్య, దొంతమల్ల గణేశ్, గిరగాని సమ్మయ్య, లకావత్ వెంకట్, నాగరాజు, పసుల వెంకట్, బత్తుల కొమురయ్య, బీరెల్లి రవివర్మ, బానోత్ శంకర్, జోగు గోపి ఉన్నారు.