పాలకుర్తి, నవంబర్ 5 : పాలకుర్తి ప్రాంత ప్రజల ముద్దుబిడ్డ, పోరాట యోధుడు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ప్రదాత నల్ల నర్సింహులు అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని జనగామ రోడ్డులో కామ్రేడ్ నల్ల నర్సింహులు విగ్రహవిష్కరణ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకిటి రాజుకుమార్లతో కలిసి ఆవిష్కరించారు. ఆనంతరం పద్మశాలీ సంఘం మండలాధ్యక్షుడు మాచర్ల సారయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పోరాటయోధులు, వీరులు, కవులకు జన్మనిచ్చిన గడ్డ పాలకుర్తి అని కొనియాడారు.
నల్ల నర్సింహులు విగ్రహనికి తనవంతు సాయం చేశానన్నారు. పాలకుర్తి ప్రాంతంలో మహానీయుల విగ్రహలు నెలకొల్పానన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ నల్ల నర్సింహులు అణగారిన వర్గాల బిడ్డ అని అన్నారు. నల్ల నర్సింహులు, రావి నారాయణరెడ్డి, చాకలి ఐలమ్మ, బందగీ పోరాటాలు మరిచిపోలేనివన్నారు. అణగారిన వర్గాల బిడ్డ కావడంతోనే నర్సింహులు పోరాట చరిత్ర బయటకు రాలేదన్నారు. నల్ల నర్సింహులు శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు మూర్ఖులని, సాయుధ పోరాట చరిత్ర తెలియని అజ్ఞానులని మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ నేత ప్రశాశ్‌రెడ్డి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను అవహేళన చేస్తున్నారన్నారు. జనగామ జిల్లాలో ప్రతి గ్రామానికి ఓ చరిత్ర ఉందని, నర్సింహులును జైలులో పెట్టి చిత్ర హింసలకు గురిచేసింది కాంగ్రెస్ పార్టే అన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్, నల్ల నర్సింహులు బిడ్డ చింతకింది అరుణ, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజ్‌కుమార్, రాపోలు వీరమోహన్, గుమ్మడిరాజుల సాంబయ్య, సింగారపు రమేశ్, దుస్సా జనార్దన్, పోగు శ్రీనివాస్, మాచర్ల పుల్లయ్య, చెన్నూరి సోమనర్సయ్య, మేడారపు సుధాకర్ పాల్గొన్నారు.