ములుగు రూరల్, ఫిబ్రవరి 25 : విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాస్‌పై దాడి చేసిన అదిలాబాద్ ఎస్పీ గౌష్ఆలంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ల అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ములుగులో డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్‌కు ఎస్పీపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 23న శ్రీనివాస్ తన భార్యను సమ్మక్క-సారలమ్మ దర్శనానికి మేడారంలో హెలిప్యాడ్ చెక్‌పోస్ట్ ద్వారా తీసుకెళ్తుండగా అక్కడే ఉన్న ఎస్పీ గౌష్ఆలం ఆయన యూనిఫామ్ గళ్లా పట్టుకొని పదే పదే లాగుతూ నానా దుర్భాషలాడాడని తెలిపారు.
శ్రీనివాస్ భార్య ఎస్పీ కాళ్లు మొక్కి బతిమిలాడినా వినిపించుకోకుండా నెట్టివేసి శ్రీనివాస్‌ను కొట్టాడన్నారు. అటవీ శాఖ ప్రొటోకాల్ వాహనాన్ని కూడా అడ్డగించి స్వల్పంగా ధ్వంసం చేశాడని తెలిపారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఎస్పీపై శాఖాపరమైన, చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డీఎఫ్‌వోకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చర్యలు చేపట్టనట్లయితే న్యాయం జరిగే వరకు విధులు బహిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ములుగు యూనిట్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఏటూరునాగారం యూనిట్ అధ్యక్షుడు నరేందర్, అటవీ అధికారులు పాల్గొన్నారు.