మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మార్చి 12 : రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని విద్యార్థులు ప్రశాంతం గా పరీక్షలు రాసేలా కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కుష్బూగుప్తా ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు. సీసీ కెమెరాల నీడలో పరీక్షలు పకడ్బందీగా చేపట్టనున్నట్లు డీఈవో ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. పరీక్షల ఏర్పాట్లపై ఆయన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 13,217 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం 60 కేంద్రాలు ఏ ర్పాటు చేశాం. మాస్ కాపీయింగ్ జరగకుండా నలుగురు ఫ్లయింగ్, 60 మంది సిట్టింగ్ స్కాడ్ బృందాలు, చీఫ్ సూపరింటెండెంట్లు 60, డిపార్ట్మెంట్ అధికారులు 60 మం ది, ఇన్విజిలేటర్లు 660 మందిని నియమించాం. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరగనుండగా.. భౌతిక, జీవశాస్త్రం మాత్రం ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు ముగియనున్నది. సిబ్బంది తప్పనిసరిగా ఐడెంటిటీ కార్డు ధరించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు.
ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అన్ని సౌకర్యాలు కల్పించాం. పిల్లలు అస్వస్థతకు గురైతే తక్షణ వైద్యం అందించడానికి ప్రతి కేంద్రంలో ఏఎన్ఎం, మందులు అందుబాటులో ఉంటా యి. విద్యుత్, తాగునీరు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉన్న కేంద్రాలనే ఎంపిక చేశాం. విద్యుత్ సరఫరాకు అంతరా యం కలగకుండా అధికారులతో మాట్లాడాం. ప్రతి కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఉంటుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సమయానికంటే గంట ముందుగా చేరుకునేలా సిద్ధం కావాలి. అరగంట ముందు నుంచే లోపలకు అనుమతిస్తాం. అత్యవసర పరిస్థితుల్లో.. సరైన రీజన్ ఉంటే నిర్ణీత సమయానికి 5 నిమిషాల తర్వాత అనుమతి స్తాం. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వం.
హాల్ టికెట్ల జారీకి ఫీజులతో ముడిపెట్టొద్దు. దీనిపై ఇప్పటికే అన్ని యాజమాన్య పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశాం. ఆన్లైన్ హాల్ టికెట్లకు కేంద్రాలోల అనుమతిస్తాం. హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్లో స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రం చిరునామా, రూట్ మ్యాప్ చూపిస్తుంది. నిర్ణీత సమయానికి విద్యార్థులను చేరవేయడానికి ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పోలీస్ అధికారులతో కూడా చర్చించాం.
లోపాలు తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించేందుకు నియమించిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల వివరాల విషయంలో ఈ సారి ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాం. వ్యక్తిగతంగా వారికి ఉత్తర్వులు జారీ చేయడంతో ఏ పరీక్షా కేం ద్రంలో ఎవరు విధులు నిర్వహిస్తారనే విషయం మిగిలిన వారికి తెలియకుండా ఉంటుంది. ఈ విధానం పరీక్షల్లో అక్రమాలు తలెత్తకుండా ఉండేందుకు దోహదపడుతుంది.
ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్షలంటే భయం సహజం. ఫలితంగా పిల్లల్లో ఒత్తిడి పెరుగుతుంది. వారు ఒత్తిడికి లోను కాకుండా ఉండేందుకు సీబీఎస్ఈ తరహాలో పరీక్షలకు మధ్య విరామాన్ని పెంచారు. పరీక్షల మధ్య మూడు నుంచి ఐదు రోజుల సమయం ఉంది. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా మరోసారి సాధన చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కష్టం అనుకున్న అంశాలు మరోసారి గుర్తు చేసుకుని ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. ప్రణాళికతో చదివితేనే విజయం సొంతమవుతోంది.