గిర్మాజీపేట, జూలై 30 : ఒకవైపు చేసిన పనికి జీతం రాక.. మరోవైపు ఈ విద్యా సంవత్సరానికి కొంతమంది ఉద్యోగాలు రెన్యువల్ కాక గెస్ట్ లెక్చరర్లు ఆగమవుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్లూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
గత విద్యా సంవత్సరంలో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన జీతాలతో పాటు ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై ఆగస్టు నెల వస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయకపోవడంతో అప్పుచేసి కుటుంబ అవసరాలను తీర్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
రెన్యువల్ కాని ఉద్యోగాలు
ప్రతీ సంవత్సరం మాదిరిగానే గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నా 1654 మంది గెస్ట్ లెక్చరర్లను కంటిన్యూ చేశారు. కానీ 2024-25 విద్యా సంవత్సరంలో టీజీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 1,256 రెగ్యులర్ లెక్చరర్లు విధుల్లో చేరగా..మిగిలిన 580 మందిని ఈ విద్యా సంవత్సరం నుండి విధుల్లో కంటిన్యూ చేస్తున్నారు.
ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు 30 మందిని ఇంతవరకూ ప్రభుత్వం ఉద్యోగాల్లోకి తీసుకోలేదని గెస్ట్ అధ్యాపకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గెస్ట్ అధ్యాపకులను ప్రస్తుత విద్యా సంవత్సరానికి రెన్యువల్ చేసి పెండింగ్ జీతాలను వెంటనే అకౌంట్లలోకి జమ చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం స్పందించాలి
అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్రెడ్డి తక్షణమే స్పందించాలి. త్వరగా అధ్యాపకులను రెన్యువల్ చేయాలి.
– మందపురం హరిబాబు, గెస్ట్ లెక్చరర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు, వరంగల్