అన్నదాతకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి.. సాగు నుంచి పంట అమ్ముకునే వరకు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ప్రకృతి సహకరించక.. ప్రభుత్వం నీళ్లు విడుదల చేయక.. అవసరానికి యూరియా దొరకక ఇబ్బందులు పడిన రైతులు.. అనేక అవస్థలు పడి పండించిన ధాన్యం విక్రయించేందుకూ ఆపసోపాలు పడాల్సి వస్తున్నది. కోతలు మొదలైనప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక.. ప్రారంభించిన వాటిలో క్రయవిక్రయాలు జరగక ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలకు ఆరబోసిన వడ్లు తడుస్తుంటే తలలు పట్టుకుంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి కొనే వారి కోసం రోజుల తరబడి ఎదురుచూస్తూనే ఉన్నారు.
– జనగామ, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ)
పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. వరి కోతల తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధం చేసి పడిగాపులు పడుతున్నారు. తెలంగాణలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే జనగామ ప్రాంతంలో వాతావరణం దృష్ట్యా విభిన్నమైన సాగు పద్ధతి ఉంటుంది. ఇతర జిల్లాలతో పోలిస్తే 30 నుంచి 45 రోజుల ముందుగానే సెప్టెంబర్ చివరి నుంచే కోతలు ప్రారంభమవుతాయి. దీనికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయాల్సి ఉండగా వివిధ కారణాలతో అధికారులు ఆలస్యంగా కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. సీజన్ ప్రారంభమై దాదాపు 45 రోజులు గడుస్తున్నా.. జిల్లాలో 30 శాతం కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభించిన ఫలితంగా రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు.
అయితే గడిచిన రెండు, మూడు రోజులుగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే జనగామ మార్కెట్లో తేమ పేరుతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఐకేపీ సిబ్బంది ముందుకు రావడంలేదు. జిల్లాలో 309 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, అందులో 185 ఐకేపీ, 124 పీఏసీఎస్ ఉండగా, 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో 198 దొడ్డు రకం వడ్ల కొనుగోలుకు, 111 సన్న ధాన్యం సేకరణ కేంద్రాలుంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్‌కు ఏ-గ్రేడ్‌కు రూ.2,389, కామన్ రకానికి రూ. 2,369, సన్నాలకు అదనంగా బోనస్ కింద రూ.500 చెల్లించనున్నారు.
అయితే 50 లక్షల గన్నీ సంచులు అవసరమ వుతా యని అధికారులు అంచనా వేసినప్పటికీ ఇప్పటి వరకు కేవలం 11,45,000 మాత్ర మే తెప్పించారు. ఇందులో రైస్ మిల్లర్ల పరిధిలో 9,55,000 గన్నీ సంచులున్నట్లు చెబుతున్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో వేలాది బస్తాల ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఆరబెట్టుకుంటే తేమ చూసి కొనుగోలు చేస్తామని చెప్పిన అధికారులు ధాన్యం ఆరినా కూడా కేంద్రం వైపు కన్నెత్తి చూడడం లేదు. గత 10 రోజులుగా ప్రతి రోజూ ఉదయం యార్డు కల్లంలో ఆరబెట్టడం, వర్షం భయంతో సాయంత్రం కాగానే కుప్ప చేసి టార్పాలిన్లు కప్పి పడిగాపులు కాయడం దినచర్యగా మారింది.
కొందరు రైతులు ప్రభుత్వ రంగ సంస్థ కొనుగోలు చేసేందుకు ఆలస్యం చేస్తున్నదని విసిగి వేసారి ప్రైవేట్ ట్రేడర్లకు క్వింటాకు రూ. 1,750 నుంచి రూ. 1,880 వరకు అమ్ముకొని నష్టాల పాలవుతున్నారు. జిల్లాలోని చాలా ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో కొనుగోలు చేసిన నిల్వలు తరలింపునకు నోచుకోక ఎక్కడివి అక్కడే పేరుకుపోయాయి. మరికొన్ని చోట్ల రైతులు ధాన్యం అమ్మకానికి తెచ్చి రోజులు గడుస్తున్నా ప్రభుత్వ రంగ సంస్థలు పట్టించుకోవడం లేదు. పాలకుర్తి ప్రాంతంలో రైతులు ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోసుకొని 10 రోజులు దాటుతున్నా ఇవాళ, రేపు అంటూ అధికారులు దాటవేస్తున్నారు తప్ప రాశులను ముట్టుకున్నది లేదు. తేమ శాతాన్ని కూడా పరీక్షించడం లేదని, అకాల వర్షానికి ఇప్పటికే పలుమార్లు ధాన్యం తడిసి ముద్దయ్యిందని రైతులు వాపోతున్నారు.
భారీ వర్షానికి తడిసిన ధాన్యం
బచ్చన్నపేట, అక్టోబర్15 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూర్ వీఎస్‌ఆర్‌నగర్ గ్రామంలో బుధవారం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతోనే వడ్లు తడిసినట్లు రైతలు మండిపడ్డారు. వెంటనే కేంద్రాలను ప్రారంభించి తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు.