వరంగల్,మే 5 : కుళ్లిన మాంసం, బూజు పట్టిన చికెన్, కంపుకొట్టే రిఫ్రిజిరేటర్లు, బిర్యానీ, చికెన్ ఫ్రైలో మోతాదుకు మించి రసాయనాలు.. ఈ విస్తుపోయే నిజాలు సోమవారం నగరంలో స్టేట్ ఫుడ్‌సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ దాడులతో వెలుగులోకి వచ్చాయి. లాభాపేక్షే ధ్యేయంగా కొన్ని హోటళ్లు కనీస ప్రమాణాలు, శుభత్ర పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న తీరు బయటపడింది. రాష్ట్ర ఫుడ్ సేప్టీ కమిషనర్ ఆర్.వి కర్ణన్ అదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ టీమ్ హెడ్, జోనల్ కంట్రోలర్ జోతిర్మయి నేతృత్వంలో అధికారుల బృందం హనుమకొండలోని ఫుడ్ ఆన్ ఫైర్, ల్యాండ్ మార్క్ రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు చేశారు.
దుర్వాసన వెదజల్లుతున్న రిఫ్రిజిరేటర్లు, రోజుల తరబడి నిల్వ ఉంచి మాంసం, బూజు పట్టిన చికెన్ ఉండడంతో నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తయారు చేసిన బిర్యానీ, చికెన్ ఫ్రై లాంటి వంటకాల్లో మోతాదుకు మించి ఆరోగ్యానికి హానికర రసాయనాలు వాడటాన్ని గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
రోజుల తరబడి నిల్వ ఉంచిన 32 కిలోల కుళ్లిన మాంసం, బూజు పట్టిన చికెన్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. శాంపిళ్లను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు. ఫుడ్ సేఫ్టీ చట్టం 2006ను ఉల్లంఘించినందుకు హోటల్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. నివేదిక వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జ్యోతిర్మయి తెలిపారు. రెస్టారెంట్లు, హోటల్ నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని లేకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామని హెచ్చరించారు.