స్టేషన్‌ఘన్‌పూర్, జూన్ 3: రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం డీలర్లకు తంటాలు తెచ్చిపెడుతున్నది. నెల మొత్తం నిరుపేదలు వీటిని వండుకొని తింటున్నారో.. లేదో తెలియదు కానీ, డీలర్లు మాత్రం కడుపు మాడ్చుకుంటున్నారు. చిరిగిన సంచుల్లో సరఫరా చేస్తుండడంతో బియ్యం తక్కువ వచ్చి పంపిణీలో ఇబ్బందులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రంలోని ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ డీలర్లకు బియ్యం సరఫరా జరుగుతున్నది.
అయితే చిరిగిన సంచుల్లో తరలిస్తుండడంతో లారీల్లో లోడింగ్, రేషన్ షాపుల్లో అన్లోడింగ్ చేసే సమయంలో బియ్యం కిందపోయి తక్కువగా వస్తున్నాయని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో బ్యాగులో 50.600 కిలోల బియ్యం ఉండాల్సి ఉండగా 50 కిలోలు కూడా రావడం లేదంటున్నారు. మండలంలో మొత్తం 36 రేషన్ షాపులుండగా.. ఒక్కో షాపుకు 140 బ్యాగుల ద్వారా 70 క్వింటాళ్ల బియ్యం ప్రతి నెలా సరఫరా చేస్తున్నారు.
వీటిలో చిరిగిన సంచులే అధికంగా ఉండడంతో సుమారు 50 నుంచి 80కిలోల వరకు బియ్యం తక్కువ వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. దీంతో లబ్ధిదారులకు తక్కువవుతున్న బియ్యా న్ని తమ కార్డు ద్వారా తీసుకొని పంపిణీ చేస్తున్నట్లు చెబుతున్నారు. అ లాగే విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బియ్యం తక్కువుం టే ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని, వారి వద్ద తాము దోషులుగా మిగిలిపోతున్నామని ఆవేదన వెలిబుచ్చారు.
ఈ సంచులను అమ్మడం ద్వారా వచ్చే డబ్బులు హమాలీ ఖర్చులకు సరిపోతాయని, కాని చిరిగినవి రావడంతో ఎవరూ కొనకపోవడంతో రెండు రకాలుగా నష్టపోతున్నామని పే ర్కొన్నారు. డీలర్లకు సరఫరా చేసే బియ్యాన్ని సంచుల చొప్పున కాకుండా వే బ్రిడ్జిపై కాంటా పెట్టి అందించాలని, బిల్లును కూడా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని డీలర్లు ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి ఖాసీంను కోరారు.