టేకుమట్ల/మొగుళ్లపల్లి, ఫిబ్రవరి5: చలివాగు ఆ తండ్రి కొడుకుల పాలిట శాపంగా మారింది. నాడు తండ్రి చలివాగులో మునిగిన తన కొడుకుని కాపాడి అతడు మృతి చెందాడు. అదే కొడుకు బుధవారం చలివాగులో మళ్లీ మునిగాడు కానీ కాపాడేందుకు తండ్రి లేకపోవడంతో తుది శ్వాస విడిచాడు. వివరాలిలా ఉన్నాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని పంగిడిపల్లి గ్రామానికి చెందిన పురాణం భవాని చిన్న కుమారుడు సంతోష్ సెలవులకు ఇంటికి రాగా సెప్టెంబర్ 9, 2023న ఆశిరెడ్డిపల్లి శివారులో చలివాగులో చేపలు పట్టేందుకు తండ్రి, కొడుకు వెళ్లారు. ఈ క్రమంలో సంతోష్ చలివాగులో పడి కొట్టుకుపోతుంటే భవాని కాపాడేందుకు అందులోకి దూకి కొంతదూరం లాక్కొచ్చాడు. ప్రవాహం వేగంగా ఉండడంతో మరికొంత మంది వెళ్లి సంతోష్‌ను ఒడ్డుకు చేర్చగా భవాని మాత్రం శ్వాస ఆడక వాగులో మునిగి చనిపోయాడు.
అప్పుడు ప్రాణాలతో బయటపడిన సంతోష్ మొగుళ్లపల్లి ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ, స్థానిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల నుంచి పాఠశాలకు వెళ్లకుండా వసతి గృహంలో ఉంటున్నాడు. బుధవారం ఉదయం తన స్నేహితుడితో కలిసి ఈత కొట్టడానికి నవాబుపేట-మొగుళ్లపల్లి గ్రామాల మధ్య గల చలివాగులోకి లోతు తెలియక ఒకసారిగా మునిగిపోయాడు. స్నేహితుడు కాపాడేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపకల పొలాల్లో ఉన్న రైతులు గమనించి బయటికి తీయగా అప్పటికే సంతోష్ మృతి చెందాడు. తండ్రి, కొడుకు మృతి చెందడంపై గ్రామస్తులు అయ్యో పాపం చలివాగు ఇద్దరిని పొట్టన పెట్టుకుందని వాపోయారు. ఘటనా స్థలానికి జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి సునీత, తహసీల్దార్ సునీత చేరుకున్నారు.
వసతి గృహం ఎదుట మృతదేహంతో ధర్నా..
వసతి గృహం అధికారుల నిర్లక్ష్యంతో తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ విద్యార్థి మృతదేహంతో హాస్టల్ ఎదుట తల్లి, బంధువు లు ధర్నా చేశారు. చిట్యాల సీఐ మల్లేశ్, ఎస్ఐ అశోక్ వారికి సర్ది చెప్పినా వినకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుమారు రెండు గంటల పాటు ఆందోళన కొనసాగింది. ఎట్టకేలకు సీఐ హామీతో ధర్నా విరమించారు.