వరంగల్, జూన్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చాయని మురిసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వానకాలం ప్రారంభంలోనే కురిసిన జల్లులకు పత్తి విత్తనాలు వేసిన అన్నదాతలు.. ఇప్పుడు మొగులు వైపు చూస్తున్నారు. నీరులేక సగానికిపైగా విత్తనాలు ఎండిపోగా.. మొలకెత్తిన వాటిని కాపాడుకునేందుకు బిందెలు, చెంబులు, లోటలతో తడి అందిస్తున్నారు.
వానకాలం ప్రారంభమై నెల గడుస్తున్నా ఒక్క గట్టి వర్షం పడకపోవడంతో ఉమ్మడి జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణ వర్షపాతంలో సగం కూడా కురవకపోవడంతో సాగు చేసేందుకు తండ్లాడుతున్నారు. ఒక్క పత్తి మినహా మిగతా పంటలు ఇప్పటికీ వేయక భూములను పడావుపెడుతున్నారు. రెండు రోజులుగా అక్కడక్కడా జల్లులు కురుస్తున్నా.. పంటలు సాగయ్యే భారీ వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రతికూల వాతావరణం, అదనుకు పెట్టుబడి ఖర్చులు లేకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో వానకాలం పంటల సాగు ఊపందుకోలేదు. గత రెండుమూడేండ్లలో ఎప్పుడూ లేనంత తక్కువ వర్షం జూన్‌లో కురిసింది. సాధారణం కం టే సగం వర్షపాతం కూడా నమోదు కాకపోవడం తో మొత్తం సాగు భూముల్లో 20 శాతం పంటలు వేయలేదు. ఒక్క పత్తి మినహా ఏ ఇతర పంటలూ సాగు కావడంలేదు.
వానకాలంలో ఎక్కువ సాగు చేసే పెసర, మినుము, నువ్వుల పంటల విత్తనాలు వేయలేని పరిస్థితి నెలకొన్నది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రైతులు ముందస్తు వానలకు పత్తి గింజలు పెట్టారు. ఆ తర్వాత వర్షాలు కురవకపోవడంతో పత్తి గింజలు భూమిలోనే ఎండిపోయాయి. మరోసారి గింజలు పెట్టేందుకు రైతులకు పెట్టుబడి రెండింతలయ్యే పరిస్థితి దాపురించింది. బుధవారం సాయంత్రం నుంచి అక్కడక్కడా జల్లులు పడుతున్నా నీటి వనరులు పెరిగేలా భారీ వానలు కురవడం లేదు.
జూన్ 1 నుంచే వానకాలం మొదలవుతుంది. పెట్టుబడి ఉంటేనే రైతులు అనుకున్నట్లుగా పంటల సాగు జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ప్రక్రియను నెల రోజులు ఆలస్యంగా మొదలు పెట్టింది. దీంతో ముందస్తుగా కురిసిన వానల సమయంలో రైతుల దగ్గర పెట్టుబడి ఖర్చులకు పైసలు లేక దుక్కులు సిద్ధం చేయలేని పరిస్థితి నెలకొన్నది. బ్యాంకులు, ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి దుక్కులు చేసుకొని వాన కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదనుకు భరోసా ఇవ్వకపోవడం, ముందస్తు వానల సమయంలో పెట్టుబడి లేకపోవడంతో వానకాలం సాగుపై ప్రభావం పడింది.
ఎప్పటిలాగే ఈసారి కూడా పత్తి పంటే ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా సాగవుతున్నది. మొత్తంగా సాగవుతున్న భూముల్లో ఇప్పటి వరకు కేవలం 20 నుంచి 25 శాతం విస్తీర్ణంలోనే రైతులు పంటలు వేశారు. ఇలా సాగైన భూమిలో 90 శాతం వరకు పత్తి పంటే ఉన్నది. వరంగల్ జిల్లాలో 66,342 ఎకరాల్లో, హనుమకొండలో 51,546, మహబూబాబాద్‌లో 21,025, జనగామలో 40,035, జయశంకర్ భూపాలపల్లిలో 65,595, ములుగు జిల్లాలో 10,600 ఎకరాల్లో పత్తి సాగవుతున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాన పంటగా ఉన్న వరి సాగుకు అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో ఇప్పుడే నాట్లు వేసే పరిస్థితి లేదు. సొంతంగా నీటి వసతి ఉన్న రైతులు మాత్రం నారు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. జలాశయాల్లో నీరు లేకపోవడంతో భారీ వర్షాలు పడితే పొలాలను నాటు కోసం సిద్ధం చేసుకునేందుకు రైతులు ఎదురు చూస్తున్నారు.