వరంగల్ చౌరస్తా: ధరణి స్థానంలో తీసుకువచ్చిన భూభారతి చట్టం శాశ్వత పరిష్కారం చూపేదిగా లేదని తెలంగాణ రైతు సంఘం ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం అబ్బనికుంటలోని తెలంగాణ రైతు సంఘం భవనంలో జిల్లా అధ్యక్షులు సోమిడి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల కన్వీనర్ సోమ రాంమ్మూర్తి, రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు మాచర్ల బాలరాజు, ఏఐకేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎండీ ఇస్మాయిల్, ఆర్ఎస్పీ నాయకులు వల్లందాస్ కుమార్లు పాల్గొని మాట్లాడారు.
రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా అవినీతి మయంగా మారిపోయిందని అన్నారు. గ్రామీణ, పట్టణ భూములన్నింటిపై ఆధునిక సర్వే నిర్వహించి హద్దుల విషయంలో సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టడం కోసం సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్, ఆర్డీఓ, తాసిల్దార్లు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ చట్టం పై రైతులకు తగిన అవగాహణ కల్పించడం ద్వారా చాలా సమస్యలకు పరిష్కార మార్గాలు దొరికే అవకాశాలు ఉన్నాయని ఆన్నారు. మొబైల్ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడం మూలంగా వివాదాస్పద భూముల విషయంలో ప్రభుత్వానికి పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది.
గ్రామస్థాయి హద్దుల విషయంలో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ, దేవాదాయ శాఖ భూములను సర్వే నంబర్లు బ్లాక్ చేయడం ద్వారా ఇతరులకు రిజిస్ట్రేషన్ కాకుండా రక్షించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదేల రాజయ్య, జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల బుచ్చిరెడ్డి, ఆల్ ఇండియా కిసాన్ పెడరేషన్ నాయకులు నగేష్, సోమిడి సాంబయ్య, మోకిరే పేరయ్య, ఎల్లయ్య, ఎండీ ఉస్మాన్, కొమ్మినేని రాజేందర్, సమ్మారావు, తదితరులు పాల్గొన్నారు.