కేసముద్రం, డిసెంబర్ 18 : ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి ధర తగ్గడంతో రైతులు కన్నెర్ర చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సోమవారం ఒక్కరోజే మార్కెట్‌కు 43 వేల బస్తాల ధాన్యం విక్రయానికి వచ్చింది. వ్యాపారులు క్వింటాలు జైశ్రీరాం రకానికి గరిష్ఠంగా రూ.3,301, కనిష్ఠంగా రూ.2009, ఆర్‌ఎన్‌ఆర్‌కు గరిష్ఠంగా క్వింటాలుకు రూ.3,159, కనిష్ఠంగా రూ.2000, హెచ్ఎంటీ రకానికి గరిష్ఠంగా రూ.3,259, కనిష్ఠంగా రూ. 2002 ధర నిర్ణయించారు. కాగా, మార్కెట్లో ఈ నెల 15న మార్కెట్లో పలికిన ధరల కంటే సోమవారం ధరలను తగ్గించారని రైతులు ఆందోళనకు దిగారు.
రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చిన పంట ఉత్పత్తులకు వ్యాపారులు ‘ఈ నామ్’ ద్వారా టెండర్ వేస్తారు. ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటిగంటకు టెండర్ ఓపెన్ చేసి ధరలను నిర్ణయిస్తారు. అయితే, సోమవారం మార్కెట్‌కు పరిమితికి మించి ధాన్యం రావడంతో మధ్యా హ్నం 2 గంటల తర్వాత టెండర్ ఓపెన్ చేసి రైతులకు ధాన్యం ధరలను తెలియజేశారు. గతంలో ఉన్న ధరల కంటే ప్రస్తుతం ధరలు తగ్గించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యాన్ని బస్తాల్లోకి ఎత్తుతున్న కూలీలను అడ్డుకొని నిరసన తెలిపారు. వ్యాపారులు కావాలనే ధర తగ్గించారని ఆరోపిస్తూ మార్కెట్ కార్యాలయా న్ని ముట్టడించారు. అక్కడి నుంచి మార్కెట్ ఎదుట వరంగల్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. పరిమితికి మించి ధాన్యం విక్రయానికి వచ్చిందనే సాకుతో ఒకరిద్దరు రైతుల ధాన్యానికి మాత్రమే గరిష్ఠ ధర పెట్టి, మిగిలిన రైతుల ధాన్యానికి రూ.2800 కంటే తక్కువ ధర కేటాయించారని ఆరోపించారు. క్వింటాల్‌కు సుమారు రూ.400 పైగా ధర తగ్గించారని వాపోయారు. విషయం తెలుసుకున్న ఎస్సై తిరుపతి, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడినా శాంతించలేదు. కావాలనే వ్యాపారులు ధరలు తగ్గించారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు, మార్కెట్ అధికారులు, మార్కెట్ చైర్పర్సన్ సుహాసినీ దుర్గేశ్ రైతులతో మాట్లాడారు. మిగిలిన మార్కెట్లలో కంటే కేసముద్రంలోనే ఎక్కువ ధర ఉందని సర్దిచెప్పినా రైతులు వినకుండా ఆందోళనను కొనసాగించారు. ఎక్కువ ధర పలికిన ధాన్యం రైతులు అమ్ముకోవచ్చని, తక్కువ ధర పలికిన ధాన్యానికి మంగళవారం మళ్లీ టెండర్ వేయిస్తామని చెప్పడం తో రైతులు శాంతించారు. సుమారు 2 గంటల పాటు రైతులు ఆందోళన చేయడంతో తొర్రూరు, నెక్కొండకు వెళ్లే రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయా యి. కాగా, మార్కెట్‌కు పరిమితికి మించి ధాన్యం రావ డం.., టెండర్ ఆలస్యం.. ఫలితంగా కాంటాలు కూడా లేట్‌గా ప్రారంభమయ్యాయి. దీంతో మార్కెట్లో ధా న్యం పేరుకుపోయింది. మార్కెట్లో స్థలం లేనికారణం గా చైర్పర్సన్ సుహాసిని మంగళవారం మార్కెట్‌కు సెల వు ప్రకటించారు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ రైతులు ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు.