నర్సింహులపేట, మే 19 : వడ్ల కొనుగోళ్లలో ఆలస్యంపై రైతులు ఆగ్రహం వ్య క్తం చేశారు. నర్సింహులపేట మండలం వస్రంతండా కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు దాటినా కాంటాలు పెట్టడం లేదని మంగళవారం వడ్ల బస్తాలకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ఇంకో ఐదు రోజులైయితే రోహిణి కార్తె ప్రారంభమవుతుందని, ముందుగానే వర్షాలు కురుస్తాయని శాస్త్రవేతలు చెబుతుండడంతో వానకాలం వ్యవసాయ పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం ఉండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
నర్సింహులపేట మండలం వస్రంతండా కొనుగోలు కేంద్రానికి 32 రోజుల క్రితం రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చారు. రేపు, మాపు అంటూ నిర్వాహకులు కాంటా పెట్టడడం లేదు. కొనుగోలు కేంద్రానికి 5వేల గన్నీ సంచులు ఈ నెల 17న వస్తే సీరియల్ ప్రకారం ఒకరిద్దరికి ఇచ్చి మిగిలిన బస్తాలు మంగళవారం తెల్లవారు జామున మాయం చేశారు. దీనిపై ఆగ్రహించిన రైతులు కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. నెల రోజుల నుంచి ఇక్కడే ఉంటూ ఎండల్లో నానా ఇబ్బందలు పడుతున్నామని ఆవేదన చెందారు. గన్నీ సంచులు అమ్ముకున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ధాన్యా న్ని కాంటా వేయకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యానికి నిప్పుపెట్టారు. సర్కారు నిర్ల క్ష్యం, అధికారుల తీరుపై మండిపడ్డారు.
వడ్లు పోసి నెల రెండు రోజులైయింది
కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి నెలమీద రెండు రోజులైయింది. ఈ మధ్యలో కొత్త బస్తాలు వచ్చినయి. ఇక్కడ పని చేసే పిల్లగాడు నాకు కొంచం దగ్గర. బస్తాలు ఇస్తాడనే ఆశతో ఐదు బీర్లు తాగించిన. ఎట్లయినా నాకు బస్తాలు వస్తయని గమ్మున కూసున్న. కానీ, రాత్రికి రాత్రే బస్తాలు మొత్తం మాయం చేసిండ్రు. తెల్లారివచ్చి చూస్తే గదికి వేసిన తాళం వేసినట్లే ఉంది.. లోపల బస్తాలు లేవు. ఇంత అన్యాయమా? వీళ్లకు మా గోస తగులుది.
– గుగులోత్ లక్ష్మణ్ గంగ్యాతండా
రాత్రికి రాత్రికే బస్తాలు మాయం చేసిండ్రు..
వడ్లు కొనుగోలు కేంద్రంలో పోసి నెల రోజులు దాటిది. బస్తాలు ఇగరాలే.. అగరాలే అంటున్నరు. 17న ఉదయం 5వేల బస్తాలు వచ్చినయి. 18న అడిగితే సీరియల్ ప్రకారం ఇస్తామని ఒకరిద్దరికి 100, 200 బస్తాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు రూమ్లో బస్తాలు లేకుండా మాయం చేసిండ్రు. రాత్రికి రాత్రి పైసలకు అమ్ముకున్నారేమో ఇప్పుడు బస్తాలు లేవు. దొంగలు పడ్డరని అంటున్నారు. దొంగలు పడితే వేసిన తాళం వేసినట్లు ఎట్లా ఉంటుంది. కొనుగోలు కేంద్రం కాడ ఒకరు కూడా లేరు. బాధ్యత ఎవరు వహించాలి. మా వడ్లు కాంటాలు వేసేలా అధికారులు చర్య తీసుకోవాలి.
– పులిచింత వెంకట్రెడ్డి, పెద్దనాగారం