దుక్కులు పొతం చేస్తున్న అన్నదాతలు
వ్యవసాయ పనుల్లో నిమగ్నం
విత్తన కొనుగోళ్లకు సన్నద్ధం
రైతులు సాగుబాట పట్టారు. ములుగు జిల్లాలో మూడు రోజుల క్రితం వర్షంతో పాటు రెండు రోజులుగా కొద్దికొద్దిగా వాన పడుతున్నది. దీంతో అన్నదాతలు దుక్కులను పొతం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు నాణ్యమైన విత్తనాలను కొనుగోలుకు సన్నద్ధమవుతున్నారు. పొలం పనులు మొదలు కావడంతో వ్యవసాయ కూలీలు సైతం బిజిబిజీగా కనిపిస్తున్నారు.
ములుగు, జూన్12 (నమస్తే తెలంగాణ) : ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు పొలంబాట పట్టారు. దుక్కులు దున్నుతూ సాగుకు సన్నద్ధమవుతున్నారు. జూన్ మొదటి వారం నుండే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ కూలీలు సైతం బిజి బిజీగా కనిపిస్తున్నారు. సంబురంగా వ్యవసాయ పనులు సాగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ములుగు, గోవిందరావుపేట, వెంకటాపూర్, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(నూగూరు) మండలాల్లో ఉప్పటికే కొంత మంది రైతులు పొలం పనుల్లో నిమగ్నమై విత్తనాలను విత్తుతున్నారు. ఫర్టిలైజర్ షాపుల వద్ద రైతులు విత్తనాలను కొనుగోలు చేసేందుకు వెళ్తున్నారు. విత్తనాలను కొనుగోలు చేసిన అనంతరం పొలం వద్ద మైసలమ్మలకు, చెరువు కట్టలపై మైసమ్మ, ఇష్ట దేవుళ్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.