పెట్టుబడి సాయం కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తున్న రైతన్నల్లో అయోమయం.. గందరగోళం కొనసాగుతూనే ఉంది. రైతుబంధు పథకం పేరు మార్చి ప్రతి సీజన్‌కు రూ.7500 ఇస్తామంటూ ‘కోతలు’ కోసిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చి ఏడాదైనా రైతుకు భరోసా ఇవ్వకపోవడంపై అందరిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా శనివారం అసెంబ్లీ జరిగిన చర్చలోనూ పెట్టుబడి సాయం ఎప్పుడు, ఎవరికిస్తారనే విషయమై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వకుండా దాటవేయడంపై నిరాశకు గురయ్యారు. ఇప్పటికైనా నాణ్చివేత ధోరణి వీడి కొర్రీలు పెట్టకుండా అన్ని పంటలకు, అందరు రైతులకు రైతుబంధు ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
– హనుమకొండ సబర్బన్, డిసెంబర్ 21
రైతుభరోసా పథకం అమలు విషయంలో ఇంకా స్పష్టతే రావడం లేదు. అసెంబ్లీలో శనివారం జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో గుట్టలకు, రాళ్లకు కూడా రైతుబంధు పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగాయని ఆరోపణల పర్వానికి తెరలేపారే తప్ప ఎప్పుడిస్తారో, ఎవరికి ఇస్తారనేది మాత్రం చెప్పకుండా దాటవేయడం రైతులకు విస్మయం కలిగించింది. గతంలో బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన రైతుబంధు స్థానంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా పేరుతో ఎకరానికి ప్రతి పంట కాలానికి రూ.7500కు పెంచుతామని గద్దెనెక్కి.. ఏడాది దాటినా ఇప్పటివరకు అమలుచేయలేదు. అప్పుడిస్తాం, ఇప్పుడిస్తాం అని దాటవేస్తున్నరే తప్పితే అమలు మాత్రం చేయడం లేదు.
తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో శనివారం రైతుభరోసాపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన ముఖ్యమంత్రి గతంలో కొందరు అధికారులు చేసిన పొరపాట్లను మాత్రమే ప్రస్తావించారు తప్ప ఇప్పుడు ఇస్తామని మాత్రం చెప్పకపోవడం పట్ల రైతులు నిరాశకు గురయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధుల ద్వారా లక్షా 45వేల 44మందికి 132కోట్ల 137 రూపాయలు 2023 డిసెంబర్లో రైతులకు ఇచ్చారు. ఇక ఆ తర్వాత రైతులకు ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా స్పష్టత లేకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతులందరికీ ఇవ్వాలి
పంట పెట్టుబడి కోసం గతంలో ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని ప్రతి సీజన్లో తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ పథకం వల్ల పంటలు పండించుకునే రైతులకు మంచి ఉపశమనం కలిగించేలా ఉండేవి. ఇప్పుడు రెండు సీజన్ల నుంచి పెట్టుబడి డబ్బులు లేకపోవడంతో మేమంతా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా రైతుబంధు ఇవ్వాలి.
– పొలాటి గోపాల్‌రావు, రైతు, ఎల్కతుర్తి మండలం, సూరారం
అన్ని పంటలకు ఇవ్వాలి
రైతులు పండించే అన్ని పంటలకు రైతుబంధు ఇవ్వాలి. దీర్ఘకాల పంటలకు కూడా రెండు సార్లు రైతుబంధు ఇస్తేనే మాకు కొంత ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుంది. మూడు పంటలు కూడా పండిం చే రైతులుంటే వారికి కూడా మూడు సార్లు రైతు భరోసా ఇచ్చినట్లయితే వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాలుంటాయి.
– మిల్కూరి తిరుపతిరెడ్డి, రైతు, ఎల్కతుర్తి
రైతులందరికీ రుణమాఫీ చేయాలి
కురవి, డిసెంబర్ 21: రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన రైతు బేతమళ్ల సహదేవ్ నాగలి భుజాన వేసుకుని కలెక్టరేట్‌కు పాదయాత్రగా బయలుదేరాడు. మండల కేంద్రంలో సహదేవ్ చేపట్టిన రైతు నిరసన దీక్ష శనివారానికి 7వ రోజుకు చేరగా, రైతులు భూక్యా మంగీలాల్‌నాయక్, మిర్యాల శ్రీనివాస్, నూతకి సాంబశివరావు సంఘీభా వం తెలిపి ఆయన వెంట వెళ్లారు. అనంతరం కలెక్టరేట్‌లోకి వెళ్లి అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా సహదేవ్ మాట్లాడుతూ సర్కారు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని వెంటనే చేయాలన్నారు.
రేషన్, ఆధార్ కార్డు అని.. అనేక ఆంక్షలు విధిస్తూ రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. విడుతల పేరుతో మోసం చేస్తున్న ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెప్తారని, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ నిలువదని అన్నారు. కనీసం రూ. లక్షలోపు ఉన్న రైతులకు మాఫీ కాలేదంటే ఇంకెవరికి చేశారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం స్పందించి జనవరి 26 వరకు రూ. 2 లక్షల లోపు ఉన్న రైతులందరికీ పంట రుణమాఫీ చేయాలన్నారు. లేకుంటే ఫిబ్రవరి మొదటి వారం నుంచి కలెక్టరే ట్ ఎదుట ఆమరణ నిరహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.
ఈ పాదయాత్రకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్, రైతు సంఘం నాయకుడు కుర్ర మహేశ్, బీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకుడు గుగులోత్ రవినాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ భీమానాయక్, జిల్లా అధ్యక్షుడు అంగోత్ చందూలాల్, అంబేదర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నీరుడు సామ్యేల్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు సురేశ్ నాయక్, గిరిజన వికలాంగుల హకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ రాందాస్‌నాయక్, ఎన్పీఆర్డీ మాజీ రాష్ట్ర నాయకుడు సయ్యద్‌ఖాజా, రైతులు, జర్నలిస్టులు మద్దతు తెలిపారు.