పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 10: ప్రముఖ సాహితీవేత్త, కథకుడు, వ్యాసకర్త, మిత్ర మండలి పూర్వ కన్వీనర్ సంధ్య రంగారావు మృతి చెందారు. హనుమకొండ బ్రాహ్మణవాడకు చెందిన ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో బుధవారం ఉదయం మరణించారు. కాళోజీ సోదరులు స్థాపించిన మిత్రమండలి సంస్థలకు 12 ఏళ్లపాటు కన్వీనర్‌గా పని చేసి సాహితీసేవలు అందించారు. కాళోజీ సోదరులతోపాటు రెండు తెలుగు రాష్ర్ర్టాల్లో ఉన్న అనేక మంది కవులు, రచయితలకు ఆత్మీయులుగా మెలిగారు.
ఆయన దర్గా కాజీపేట ప్రభుత్వ పాఠశాలలో హెడ్మాస్టర్గా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. పలు కథలు, కవితలు, పుస్తక సమీక్షలు చేశారు. ఇతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ సందర్భంగా కాళోజీ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి మాట్లాడుతూ.. సంధ్య రంగారావు మరణం సాహితీలోకానికి తీరని లోటన్నారు.
కాళోజీ ఫౌండషన్, మిత్ర మండలి సభ్యులతో ఎనలేని అనుబంధం ఉందని, ఆయన మృతితో సభ్యులందరూ భాతతప్త హృదయాలతో వారి కుటుంబానికి సంతాపం ప్రకటించారని పేర్కొన్నారు. కాగా, రంగారావు మృతికి డాక్టర్ అంపశయ్య నవీన్, పొట్లపల్లి శ్రీనివాసరావు, గంటా రామిరెడ్డి, ఆచార్య బన్న అయిలయ్య, పందిళ్ల అశోక్‌కుమార్, డాక్టర్ ఆగపాటి రాజ్‌కుమార్ సంతాపం ప్రకటించారు.