సుబేదారి, మార్చి22 : బ్రాండెడ్ కంపెనీ పేర్లతో నకిలీ, కాలం చెల్లిన పురుగు మందులను విక్రయించి రైతులను మోసం చేసి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దమొత్తంలో నకిలీ పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీసు కమిషనర్ సన్ ప్రీత్‌సింగ్ నిందితుల అరెస్ట్‌ను చూపి, వివరాలు వెల్లడించారు.
సీపీ కథనం ప్రకారం.. వరంగల్ మట్టెవాడకు చెందిన ప్రధాన నిందితుడు ఇరుకుల్ల వేదప్రకాశ్, వరంగల్ లక్ష్మీపురానికి చెందిన మహ్మద్ సిద్దిక్ ఆలీ, పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌బాద్‌కు చెందిన నూక రాజేశ్, కరీంనగర్‌కు చెందిన సదాశివుడు, ములుగు జిల్లా గోవిందారావుపేటకు చెందిన ఎండీ రఫీక్, ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన ఆళ్లచెరువు శేఖర్, పరారీలో ఉన్న వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన పొదిళ్ల సాంబయ్య, జైల్లో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ముద్దగుల ఆదిత్య ముఠాగా ఏర్పడ్డారు.
సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో ప్రధాన నిందితుడు వేదప్రకాశ్ పురుగు మందుల విక్రయాల వ్యాపారుస్తుల నుంచి పెద్దమొత్తంలో కాలం చెల్లిన పురుగు మందులు కొనుగోలు చేసేవాడు. వీటిపాటుగా ముఠా సభ్యులతో కలిసి దనూక, టాటారైల్స్, బెయర్, ఆడ్మా, మరికొన్ని బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ పురుగు తయారు చేసి రైతులకు విక్రయించేవారు. పోలీసులకు పక్కాసమాచారం రావడంతో మట్టెవాడ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా వ్యవసాయ అదికారులతో కలిసి మట్టెవాడ పోలీసుస్టేషన్ పరిధిలోని బొడ్రాయి ప్రాంతంలోని ప్రధాన నిందితుడు వేదప్రకాశ్ ఇంటిపై దాడి చేసి, ముగ్గురు నిందితులు సిద్ధిక్, రాజేశ్, సదాశివుడును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.
నకిలీ పురుగు మందులు తయారుచేస్తున్న శేఖర్, విష్ణువర్ధన్ గోదాములపై దాడి చేసి, వారి నుంచి నకిలీ పురుగు మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితుల నుంచి 78.63లక్షల విలువ చేసే గడువు ముగిసిన పురుగుమందులు,నకిలీ పురుగు మందులు,రెండు కార్లు,ఆరు సెల్పోను,్ల నకిలీ పురుగు మందుల తయారీకి ఉపయోగించిన మిషనరీ, ప్రిటింగ్ సామగ్రి స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. ఈముఠాను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా,టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్,వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్,ఇన్స్పెక్టర్లు రాజు,గోపి,ఎస్సైలు వంశీకృష్ణ,నవీన్, సిబ్బందిని సీపీ అభినందించారు.