అన్నదాతకు నకిలీ, నిషేధిత విత్తనాల బెడద తప్పడం లేదు. ఏటా ఆర్థికంగా నష్టపోతున్నా నకిలీ దందాకు అడ్డుకట్ట పడడం లేదు. విత్తన వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలూ అమలుకు నోచుకోవడం లేదు. మహారాష్ట్ర నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు నకిలీ విత్తనాలు జోరుగా రవాణా అవుతున్నా అధికారుల్లో చలనం లేదు. కాళేశ్వరం, మేడిగడ్డ బరాజ్ వంతెనల మీదుగా గ్రామాల్లోకి తీసుకొచ్చి నిల్వ చేస్తున్నా.. విక్రయాలు జరుపుతున్నా.. వాటిని పట్టుకునే దిక్కులేదు. ఈ దందా వెనుక బడా నేతలున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.
– జయశంకర్ భూపాలపల్లి, జూన్ 13 (నమస్తే తెలంగాణ)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విత్తన మాఫియా కోరలు చాస్తున్నది. అధిక దిగుబడి వస్తుందని రైతులకు ఆశ చూపుతున్న దళారులు నిషేధిత విత్తనాలు కట్టబెడుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి కాళేశ్వరం, మేడిగడ్డ బరాజ్ వంతెనల మీదుగా జిల్లాలోకి నకిలీ విత్తనాలు చేరుతున్నట్లు సమాచారం. వీటిని సరిహద్దు గ్రామాల్లో నిల్వచేస్తున్న దళారులు అక్కడి నుంచి వివిధ మార్గాల్లో వారికి నమ్మకమైన వ్యక్తుల వద్దకు తరలించి జోరుగా విక్రయాలు జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ క్రమంలో కాటారం సమీపంలోని ఒక మండలంలో రూ. లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు దిగుమతి కాగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించినట్లు ప్రచారం జరిగినా ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. పోలీసులు సైతం ఎలాంటి ప్రకటన చేయలేదు. ైగ్లెపోసెట్తో పాటు క్వింటాళ్ల కొద్దీ బీటీ 3 పత్తి విత్తనాలు లభ్యమైనట్లు కొందరు రైతులు స్వయంగా చెబుతున్నారు. ఏటా ఇదే దందా కొనసాగుతూ రైతులు ఆర్థికంగా నష్టపోతున్నా అధికారులు మాత్రం నకిలీ విత్తనాల వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెండు రాష్ర్టాల సరిహద్దు కేంద్రంగా జరుగుతున్న నకిలీ విత్తనాల దందాకు అండగా ఎవరు నిలుస్తున్నారన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల నిఘాలోపంతోనే పోలీస్ స్టేషన్లు దాటి జిల్లాలోని పలు గ్రామాల్లో భారీగా నకిలీ విత్తనాల నిల్వ జరుగుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బడా నేతల కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా కొనసాగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళారులు నిషేధిత జీఎం (జెనెటికల్లీ మోడిఫైడ్) బీటీ 3, బోల్‌గార్డ్ 3 (బీటీ 3) పత్తి విత్తనాలను కాటారం సబ్‌డివిజన్‌లో నిల్వ చేసి బడా రైతులతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది.
అయితే దళారులు తమ విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు గడ్డిని నియంత్రించే నిషేధిత ైగ్లెఫోసెట్ మందును ఉచితంగా అందిస్తున్నట్లు సమాచారం. పోలీసులు ఇటీవల జరిపిన దాడుల్లో బీటీ 3 విత్తనాలతో పాటు నిషేధిత గడ్డి మందు కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే కొందరు బడా నేతలు ఈ విషయం బయటకు రాకుండా పైరవీలు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. అలాగే జిల్లాలోని చిట్యాల మండలంలో గురువారం రూ. 32 వేల విలువ గల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విత్తనాలు సైతం సిరొంచ నుంచి తీసుకొచ్చినట్లు దళారులు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. దీనిని బట్టి మహారాష్ట్ర నుంచి ఏ మేరకు నకిలీ విత్తనాలు వస్తున్నాయో అవగతమవుతున్నది.