రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమది ప్రజా ప్రభుత్వమని పదేపదే చెప్పుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా నడుస్తున్నది. బెదిరింపులు.. సెటిల్మెంట్లు చేస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల అనుచరులు రౌడీ పాలన కొనసాగిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా వరంగల్ తూర్పు నియోజకవర్గం నిలుస్తుంది.
ఇక్కడ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ప్రజాప్రతినిధి అనుచరుడి దందాలు రౌడీ రాజ్యాన్ని తలపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ మాజీ రౌడీ షీటర్ ఓ మంత్రికి ప్రధాన అనుచరుడిగా మారడం.. ఎలాంటి పదవి లేకున్నా అంతా తానే అనేలా వ్యవహరిస్తూ సామాన్యులపై జులుం ప్రదర్శించడం తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మంత్రి అనుచరుడు, మాజీ రౌడీషీటర్ దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి అండతో రెచ్చిపోతూ పోలీసు అధికారులు, కొంతమంది రౌడీలను కోటరీగా పెట్టుకొని ప్రతిరోజూ ఉదయం వరంగల్ నగరంలోని అతడి ఇంటి వద్ద, సాయం త్రం నగర శివారులోని గెస్ట్‌హౌస్‌లో సెటిల్మెంట్లు చేస్తున్నట్లు తెలుస్తున్నది. వివాదాస్పద భూములు, అప్పుల పంచాయితీలను టార్గెట్‌గా చేసుకొని తూర్పు నియోజకవర్గంలో ని డివిజన్లవారీగా తన అనుచరులు, పోలీసులను ముం దుపెట్టి రూ. కోట్లల్లో సెటిల్మెంట్లు చేస్తున్నట్లు తెలిసింది.
వివాదాస్పద భూముల్లో మంత్రి అనుచరుడు తలదూర్చి తమదైన ైస్టెల్లో బెదిరించడం, వినని వారిపై కేసులు పెట్టించి బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా స్తంభంపల్లి శివారులో రూ. 7 కోట్ల విలువ చేసే మూడెకరాల సాగు భూమి విషయమై ఇద్దరి మధ్య కొనసాగుతున్న వివాదాన్ని ఆసరా చేసుకొని, వారిని బెదిరించి అతి తక్కువ ధరకు బినామీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిసింది. అలాగే వరంగల్ 34వ డివిజన్లో ఒకరిని తన అనుచరుడితో బెదిరించి రూ. 40 లక్షల భూమిని సొంతం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అలాగే ఇటీవల మంత్రి పుట్టిన రోజు సందర్భంగా మంత్రి అనుచరుడు ఓ వస్త్ర వ్యాపారిని బెదిరించి పెద్ద మొత్తంలో చీరలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. తూర్పులో అధికారిక కార్యక్రమాల పేరు చెప్పి వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు చర్చ జరుగుతున్నది.
తూర్పులో పట్టుకోసం తనకంటూ ప్రత్యేకమైన కోటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి ఆ మాజీ రౌడీషీటర్ పక్కాగా ముం దుకు వెళ్తున్నాడు. ‘అన్నకు ఏజ్ బార్ అయ్యింది.. హెల్త్ ఇబ్బంది పెడుతున్నది.. బయటకు రాలేడు.. ఇప్పుడంతా నేనే.. ఇక మనదే రాజ్యం’ అంటూ తన అనుచరులకు భరోసా ఇస్తూ డివిజన్ల వారీగా కొత్తతరం యువకులను తన వెంట ఉంచుకోవడానికి వారి పుట్టిన రోజున రూ. 5వేలు, మందు అందజేసి అభిమానం చాటుకుంటున్నట్లు తెలిసింది.
మంత్రి అనుచరుడితో పోలీ సు అధికారులు అంటకాగుతూ సామన్యులపై జులుం ప్రదర్శిస్తున్న ఘటనలు, బెదిరింపులపై ‘నమస్తే తెలంగాణ’లో శుక్రవారం ప్రచురితమైన ‘రౌడీకి పోలీసు సలాం’ కథనం తూర్పు నియోజవర్గం ప్రజల్లో చర్చనీయాంశమైంది. అధికార పార్టీ, పోలీసు వర్గా ల్లో ప్రకంపనలు సృష్టించింది. నేర స్వభావం ఉన్న వ్యక్తికి మంత్రి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని అధికార పార్టీ నేత లు చర్చించుకోవడం కనిపించింది. ఇదిలా ఉండగా, సద రు మాజీ రౌడీషీటర్ వరంగల్ పోచమ్మమైదాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 23వ డివిజన్ అధికార పార్టీకి చెందిన ఓ నేతను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు తెలిసింది. ‘నాపై ఓ నాయకుడు కావాలని పేపర్‌కు లీకులిచ్చి వార్త వచ్చేటట్టు చేశాడు.. ఇది అన్న (బాస్) చూ సి సీరియస్‌గా ఉన్నాడు.. మీరు నాతోనే ఉంటే బెటర్.. లేకుంటే మీకు భవిష్యత్ ఉండదు’ అని వార్నింగ్ ఇచ్చినట్లు విశ్వనీయ సమాచారం.
మంత్రి అనుచరుడిపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన ప్రత్యేక కథనంపై వరంగల్ పోలీసు కమిషనరేట్ నిఘా వర్గాలు ఆరా తీశాయి. అతడి దినచర్య, సహకరిస్తున్న పోలీసు అధికారులు, బెదిరింపులు, సెటిల్మెంట్లపై ఇంటెలిజెన్స్, ఎస్బీ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. మంత్రి అండతో ఇటీవల సదరు అనుచరుడు చేసిన వ్యవహారాలపై ఆధారాలతో ఒకటి రెండు రోజుల్లో నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలకు రిపోర్టు ఇవ్వనున్నట్లు తెలిసింది.