దామెర, అక్టోబర్ 22 : డమ్మీ పిస్టల్‌తో బెదిరింపులకు పాల్పడిన ప్రజా ప్రతిఘటన మాజీ నక్సలైట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హనుమకొండ జిల్లా దామెర పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరకాల ఏసీపీ కిశోర్‌కుమార్ వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడుకు చెందిన రాయల వెంకటేశ్వర్లు 2006లో ప్రజా ప్రతిఘటనలో కొరియర్‌గా పని చేసి 2007లో లొంగిపోయాడు. ఈ నెల 21న అర్ధరాత్రి 12 గంటల సమయంలో దామెర మండలం ఊరుగొండలో కిరాణా షాపు యజమాని కందికొండ సంపత్‌ను నిద్రలేపి డమ్మీ పిస్టల్ (నకిలీ ఎయిర్ గన్) చూపించి తాను మాజీ నక్సలైట్‌నని, డబ్బులివ్వాలని బెదిరించాడు.
అతడు లేవని చెప్పడంతో దాడి చేసి కౌంటర్ నుంచి రూ. 2000 తీసుకొని పారిపోయేందుకు యత్నించగా యజమాని గట్టిగా పట్టుకొని కేకలు వేయడంతో చుట్టు పక్కలున్నవారు చేరుకొని పిస్టల్‌ను తీసుకొని 100కు డయల్ చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకొని పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సంపత్ ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో పరకాల రూరల్ సీఐ రంజిత్‌రావు, ఎస్సై కొంక అశోక్ పాల్గొన్నారు.