నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 14 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఆయా జిల్లాల్లో ముఖ్య అతిథులు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. వరంగల్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హనుమకొండలో మంత్రి కొండా సురేఖ, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, మహబూబాబాద్‌లో ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రూనాయక్, భూపాలపల్లిలో తెలంగాణ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ బెల్లయ్యనాయక్, ములుగులో మంత్రి సీతక్క జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
అనంతరం ఆయా జిల్లాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నివేదిక చదివి వినిపిస్తారు. స్వాతంత్య్ర సమర యోధులను సన్మానించనున్నారు. పాఠశాలల విద్యార్థుల సాంసృతిక కార్యక్రమాలతోపాటు ఉత్తమ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేస్తారు. ఖిలా వరంగల్ ఖుష్‌మహల్ ప్రాంతంలో చేస్తున్న ఏర్పాట్లను గురువారం కలెక్టర్ సత్యశారద, భూపాలపల్లిలో డాక్టర్ బీఆర్ అంబేదర్ స్టేడియంలో కలెక్టర్ రాహుల్‌శర్మ, జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఇన్చార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అధికారులు పరిశీలించారు.