గ్రామాలు అభివృద్ధి చెంది పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలని కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టగా, కాంగ్రెస్ సర్కారు దాన్ని గాలికొదిలేసింది. పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేయడంతో పల్లె పాలన అస్తవ్యస్తంగా మారింది. నాడు పల్లె ప్రగతికి ప్రతి నెలా నిధులు విడుదల చేయడంతో ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు ప్రజల కు సద్వినియోగమయ్యాయి. నేడు సరైన నిర్వహణ లేక ఆనవాళ్లు కోల్పోయాయి. కేసీఆర్ పాలనలో పక్కాగా పనులు జరుగగా, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పల్లెల ప్రగతి ఎక్కడికక్కడే నిలిచిపోయింది.
– వరంగల్, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కేసీఆర్ పాలనలో ఎటుచూసినా పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, పరిశుభ్రమైన పరిసరాలతో చూడముచ్చటగా ఉన్న పల్లెల్లో ప్రగతి కళ తప్పింది. పల్లెల సమగ్రాభి వృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన ‘పల్లె ప్రగతి’ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా ఇవ్వాల్సిన నిధులను ఆపివేసింది. అధికారుల పాలనలో పల్లెలు ఇప్పుడు అస్తవ్యస్తంగా మారాయి. పారిశుధ్య నిర్వహణ గాలికి వదిలేశారు. కేసీఆర్ ప్రభుత్వం పల్లెల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు, హరితహారంతో పెరిగిన పచ్చదనం ఇప్పుడు పట్టించుకునే వారు లేక మోడువారుతున్నాయి. డంపింగ్ యార్డులు, వైకుంఠధామాల్లోనూ సరైన నిర్వహణ లేక ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.
పల్లెలు నిత్యం పరిశుభ్రంగా ఉండేందుకు కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతిని అమలు చేసింది. 2019 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు మొదటి విడత.. 2020 జనవరి 2నుంచి 12 వరకు రెండో విడత.. 2020 జూన్ 1నుంచి 8 వరకు మూడో విడత ‘2021 జూలై 1 నుంచి 10 వరకు నాలుగో విడత 2022 మే 20నుంచి జూన్ 5 వరకు ఐదో విడత పల్లె ప్రగతి నిర్వహించారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కలిపి 1687 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పల్లె ప్రగతి కోసం రూ.42.05 కోట్లు ఇచ్చింది. ఈ నిధులు ఇప్పుడు ఆగిపోయాయి. దీంతో పల్లెల అభివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ప్రగతి నుంచి పట్టింపులేని విధంగా పల్లెల పరిస్థితి తయారైంది. పల్లెలను స్వచ్ఛత కేంద్రాలుగా మార్చే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం డంపింగ్ యార్డులను నిర్మించింది. ప్రతి ఊరూ స్వచ్ఛంగా ఉండాలని, నిరంత రం పారిశుధ్య నిర్వహణ ఉండాలనే లక్ష్యంతో పారిశుధ్య కార్మికుల వేతనాన్ని రూ.8,500లకు పెంచింది. ప్రతి ఇంటికీ చెత్త బుట్టలను పంపిణీ చేసి గ్రామాలు శుభ్రంగా ఉండేలా ప్రణాళిక రూపొందించింది.
ప్రతి గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి ట్రాలీలో చెత్తను ఊరి అవతలికి తర లించింది. రోజువారీగా సేకరించే చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించి దాన్ని కంపోస్టు ఎరువుగా మార్చే ప్రక్రియను మొదలుపెట్టేలా వీటిని నిర్మించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తయ్యింది. ఆరు జిల్లాల్లో కలిపి 1,688 గ్రామ పంచాయతీలు ఉంటే అన్నింటిలోనూ డంపింగ్ యార్డుల నిర్మాణం చేపట్టారు. కంపోస్టు ప్రక్రియను మొదలుపెట్టారు. దీంతో ఊర్లన్నీ నిత్యం పరిశుభ్రంగా ఉండేవి.
గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం అవసరమైన పనులను పూర్తి చేసేందుకు జనాభాకనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రతి నెలా నిధులు ఇచ్చింది. వీటితో అన్ని గ్రామాల్లో వసతుల కల్పన పెరిగింది. రోడ్లు, డ్రైనేజీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలతో పాటు పల్లె ప్రకృతి వనాలు, ఎక్కడ చూసినా చెట్లతో ఊళ్లన్నీ పచ్చ గా ఉండేవి. పట్టణాలకు, నగరాలకు దీటుగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిధులను నిలిపివేసి కొత్తగా పనులు చేయకపోగా గతంలో అభివృద్ధి చేసిన వాటి నిర్వహణను మరిచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన డిసెంబర్ నుంచి ఇప్పటివరకు గ్రామపంచాయతీలకు అభివృద్ధి నిధులు విడుదల చేయలేదు.