గీసుగొండ, మార్చి 3 : పరకాల నియోజకవర్గంలో ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తే క్రికెట్ జోనల్ అకాడమీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. గ్రేటర్ వరంగల్‌లోని 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామంలో
గురువారం క్రికెట్ ఆసోసియేషన్ తెలంగాణ(సీఏటీ) ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరుగనున్న శిక్షణ శిబిరాన్ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ సీపీ తరుణ్ జోషితో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ యువకుల్లో క్రీడా నైపుణ్యం అధికంగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తూ నిధులను కేటాయిస్తున్నదన్నారు. క్రీడారంగ బలోపేతానికి మంత్రి కేటీఆర్ సబ్‌కమిటీ వేసినట్లు గుర్తు చేశారు.
ప్రతిభ కల్గిన క్రీడాకారులకు రాష్ట్ర, జాతీయ స్థాయి లో క్రికెట్ ఆడేందుకు అవకాశాలు కల్పించాలని ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి కోరారు. క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అనంతరం సీపీ తరుణ్జో షి మాట్లాడుతూ.. క్రీడలు, చదువులో అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు.
గీసుగొండ : గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. గ్రేటర్ వరంగల్ 15,16,17 డివిజన్ల కార్యకర్తల సమావేశం మండలంలోని పీడీఆర్ గార్డెన్లో జరిగింది. ఈసందర్భంగా ఆయన
మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. గ్రేటర్ పరిధిలోని గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈనెల 7 నుంచి ప్రతి గ్రామంలో కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు
చేసుకోవాలన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలన్నారు. 70 ఏండ్లలో జరుగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో ఏడేండ్లలో జరిగిందన్నారు. అర్హులందరికీ దళిత బంధు పథకం అందిస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో సీఏటీ ఫౌండర్సునీల్బాబు, జిల్లా అధ్యక్షుడు బిల్లా రమణారెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, జోనల్ మెంబర్ ఈవీ శ్రీనివాస్‌రావు, కార్పొరేటర్లు ఆకుల మనోహర్, సుంకరి మనీషా శివకుమార్, గద్దె బాబు, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు,ఎనుమాముల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పోగుల సంజీవ్, దామోదర్, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, రైతు బంధు సమితి కన్వీనర్ గజ్జి రాజు, సొసైటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ డైరెక్టర్ గోలి రాజయ్య పాల్గొన్నారు.