వాజేడు, సెప్టెంబర్ 30 : వాజేడు ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల సమయపాలన పాటించకపోవడంతో నిత్యం వివిధ సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చే ప్రజలు ఇబ్బందులు తప్పడం లేదు. సోమవారం ఉదయం 10గంటలు దాటినా కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, కంప్యూటర్ ఆపరేటర్ సహా ఎవరూ రాకపోవడంతో ఆ గదిలో అటెండర్ సాయిబాబు టేబుల్‌పై దర్జాగా కాళ్లుపైకి పెట్టుకొని నిద్రిస్తుండడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నది.
అంతేగాక హాల్ సమీపంలోని ఒక గదిని నివాస గృహంగా మార్చుకున్నాడు. కార్యాలయం ఆవరణ, మీటింగ్ హాల్ పరిసరాలు అధ్వానంగా మారగా శుభ్రం చేసేందుకు వచ్చిన గ్రామ పంచాయతీ సిబ్బందిపైనా అటెండర్ దురుసుగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు ప్రతిరోజూ సమయానికి రాకపోయి నా పట్టించుకునే వారు లేరని ఆరోపణలున్నాయి. ఎవరూ రాకపోయినా ఫ్యాన్లు, లైట్లు వేయడం విద్యుత్‌ను వృథా చేస్తున్నారని, గతంలో ఈ ఆఫీస్ విద్యుత్ బకాయి ఉండడంతో విద్యుత్‌శాఖ కరెంట్ సరఫరా నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయమై ఎంపీడీవో విజయను ‘నమస్తే’ ఫోన్లో వివరణ కోరగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.