దుగ్గొండి, జూన్,02 : వానకాలం సీజన్లో రైతుల వ్యవసాయ పనులకు విద్యుత్ శాఖ అధికారుల పనితీరు ఆటంకంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాత అడుగు ముందుకు పడలేక సాగులో వెనుకబడి పోతున్నాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని నాచినపల్లి గ్రామం పరిధిలో ఓ రైతు వ్యవసాయ భూమిలో కరెంట్ స్తంభం గత రెండు నెలల క్రితం వీచిన గాలి దుమారానికి నేలకొరిగింది. విషయం విద్యుత్ అధికారులకు రైతులు తెలుపగా ట్రాన్స్ఫార్మర్ నుండి వచ్చే కరెంటు వైర్లను కట్ చేశారు.
అప్పటి నుండి నేటి వరకు ఆ రైతు వ్యవసాయ భూమిలో సాగుకు ట్రాక్టర్లు దుక్కి దున్నకుండా అడ్డుగా ఉన్నాయని ఎన్నిసార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదు. సత్వరమే తగు చర్యలు చేపట్టి కరెంటు స్తంభం వేసి రైతు సాగుకు సహకరించాలని పలువురు రైతులు విద్యుత్ అధికారులను కోరారు.