ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం జరుగనున్న రెండో దశ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని మొత్తం 27 మండలాల్లో పంచాయతీ పోరు జరుగనుంది. మొత్తం 564 సర్పంచ్ స్థానాలు, 4,928 వార్డులుండగా, 57 సర్పంచ్, 917 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఇందులో1 సర్పంచ్, 8 వార్డులకు నామినేషన్లు రాలేదు. మిగిలిన 506 సర్పంచ్, 4,003 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు.
ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి శనివారం పోలింగ్ సిబ్బంది సామగ్రితో పల్లెలకు తరలివెళ్లారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరుగనుండగా, మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట వార్డు సభ్యులు, అనంతరం సర్పంచ్ అభ్యర్థుల ఓట్లు లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. ఆ పిదప ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించను న్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
-నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 13
67 జీపీలు.. 574 వార్డులు..
హనుమకొండ : జిల్లాలోని ధర్మసాగర్, హసన్‌పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లోని 67 జీపీలు, 574 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 73 సర్పంచ్‌లకు 6, అలాగే 694 వార్డులకు 120 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఐదు మండలాల పరిధిలో పురుషులు 62,692, మహిళలు 65,621, ఇతరులు ఇద్దరితో కలిపి మొత్తం 1,28,315 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనుండగా, వీరి కోసం 694 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
కాగా ప్రతి మండలంలో ఎన్ని వార్డులుంటే అన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా 800 బ్యాలెట్ బాక్స్‌లను వినియోగించనున్నారు. ఎన్నికల నిర్వహణకు 833 మంది పీవోలు, 1,180 మంది వోపీవోలను నియమించగా, వీరంతా ఆయా పోలింగ్ కే్రందాలకు చేరుకున్నారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 18 మంది ఇన్స్పెక్టర్లు, 32 మంది ఎస్సైలు, 120 మంది ఏఎస్సైలు, 333 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 1,133 కానిస్టేబుళ్లు, 258 మంది హోంగార్డ్స్ తదితరులు బందోబస్తు విధుల్లో ఉండనున్నారు.

వరంగల్‌లో 111 జీపీలు..
ఖిలావరంగల్ : వరంగల్ జిల్లాలోని దుగ్గొండి, గీసుగొండ, నల్లబెల్లి, సంగెం మండలాల్లో ఆదివారం రెండో విడత ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 117 సర్పంచ్ స్థానాల్లో ఐదుగురు ఏకగ్రీవం కాగా, సంగెం మండలం వంజరపల్లిలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 111 స్థానాలకు పోలింగ్ జరుగనుండగా, 350 మంది బరిలో నిలిచారు. అలాగే 1,008 వార్డు స్థానాల్లో 97 ఏకగ్రీవం కాగా, ఐదింటికి నామినేషన్లు దాఖలు కాలేదు.
దీంతో మిగిలిన 906 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, 2,142 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 67,884 మంది పురుషులు, 71,214 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు మొత్తం 1,39,100 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1,008 పోలింగ్ కేంద్రాల్లో పీవోలు, వోపీవోలు, సూక్ష్మ పరిశీలకులు కలిపి మొత్తం 2,008 మంది సిబ్బంది విధుల్లో ఉంటున్నారు. కాగా, ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు చేపట్టనున్నారు.
ములుగులో 37 జీపీలు..
ములుగు, (నమస్తేతెలంగాణ) : జిల్లాలోని ములుగు, వెంకటాపూర్, మల్లంపల్లి మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 52 జీపీలకు 15 ఏకగ్రీవం కాగా 37 సర్పంచ్ స్థానాలకు, అలాగే 462 వార్డులకు 147 ఏకగ్రీవం కాగా, 315 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడు మండలాల్లో మొత్తం 53,154 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 530 పోలింగ్ అధికారులు, 653 సిబ్బందితో కలిసి మొత్తం 1,183 మంది ఎన్నికల సిబ్బంది పోలింగ్ విధులు నిర్వర్తించనున్నారు.
భూపాలపల్లిలో 75 జీపీలు..
జయశంకర్ భూపాలపల్లి, (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని భూపాలపల్లి, టేకుమట్ల, చిట్యాల, పలిమెల మండలాల్లో ఆదివారం రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 85 జీపీలకు 10, 694 వార్డులకు 147 ఏకగ్రీవం కాగా, మిగిలిన 75 సర్పంచ్, 547 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పురుషులు 43,300, మహిళలు 44,359 మొత్తం 87,659 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనుండగా, శనివారం ఎన్నికల సిబ్బంది ఆయా పల్లెలకు తరలివెళ్లారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఏడు మండలాలు.. 143 జీపీలు
మహబూబాబాద్, (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని బయ్యారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, గార్ల, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు మండలాల్లోని 158 సర్పంచ్ స్థానాలకు 15, 1360 వార్డులకు 251 వార్డులు ఏకగ్రీవం కాగా, మరో మూడింటికి నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 143 సర్పంచ్, 1,106 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏడు మండలాల్లోని 1,99,325 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 1,106 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఏడుగురు ప్రత్యేకాధికారులు, 14 మంది జోనల్ అధికారులు, 65 మంది రూట్ ఆఫీసర్లు, 190 ఏఆర్వోలు, 1,682 మంది పీవోలు, 2,048 మంది వోపీవోలుఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. ఏడు మండలాల్లో 37 గ్రామాలను సమస్యాత్మకంగా గుర్తించిన అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.