వర్ధన్నపేట, అక్టోబర్ 11: ఎన్నికల నియామవళిని ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ అశ్వనీ తానాజీ వాకడె సూచించారు. నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో వేర్వేరుగా ప్రత్యేక సమావేశాలను నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున అధికారులు, సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. గ్రామాలు, పట్టణంలో ఎక్కడ కూడా రాజకీయ పార్టీలకు చెందిన గోడలపై రాతలు, పోస్టర్లు ఉండకుండా చూడాలన్నారు. అంతేకాక ప్రతీ గ్రామంలో కూడా ఎన్నికల నియమావళిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని తెలిపారు.
అంతేకాక రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఓటర్ల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్ల నుంచి ఏదైనా ఫిర్యాదు వచ్చినట్లయితే వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. అలాగే రాజకీయ పార్టీల నాయకులు కూడా విధిగా ఎన్నికల కోడ్‌ను పాటించాలని వివరించారు. నియమావళిని పాటించనివారిపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు.. చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు, సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉంటూ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్‌సాగర్, ఎన్నికల డీటీ రంజిత్‌కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే చర్యలు : ఏసీపీ
వర్ధన్నపేట: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎక్కడైనా ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు ప్రయత్నించినా చర్యలు తీసుకుంటామని వర్ధన్నపేట ఏసీపీ రఘుచందర్ హెచ్చరించారు. వర్ధన్నపేట పట్టణ సమీపంలో బుధవారం జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున వాహనాల్లో ఎలాంటి అధారాలు లేని నగదు, ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్ల కూడదన్నారు. రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్లినైట్లెతే తప్పకుండా దానికి సంబంధించిన రశీదులు, ఇతర ఆధారాలు ఉండాలని సూచించారు. అలాగే వాహనాల్లో ఎలాంటి మద్యం, మత్తు పదార్థాలను కూడా తీసుకువెళ్లినా కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ ప్రవీన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.