గిర్మాజీపేట, జనవరి 11: కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రతి ఆటో కార్మికుడికి అండగా ఉంటానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శివనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖిలావరంగల్‌లోని చమన్ ఆటో అడ్డా నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 25న అన్ని రంగాల కార్మికులు, లేబర్ అధికారులతో రాజశ్రీగార్డెన్‌లో జాయింట్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ వేదికపై లేబర్‌కార్డులు, ఇన్సూరెన్స్ తదితర అంశాలపై చర్చించి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్మిక సంఘాల నాయకులు సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రాజు, ఖిలావరంగల్ ఆటో అడ్డా అధ్యక్షుడు గద్దల బాబు, కార్యదర్శి ఎల్లాగౌడ్, గొర్రె నరేశ్, గద్దల అశోక్, ప్రవీణ్, మైదం శ్రీను, రాజు, శ్రీకర్, సతీశ్, రమేశ్ పాల్గొన్నారు. అనంతరం రెండోసారి ఎన్నికైన రామలింగేశ్వరస్వామి పాలకమండలి సభ్యులు నన్నపునేనిని కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ అప్పరాజు రాజు, పాలక మండలి సభ్యులు చిట్టిమళ్ల సురేశ్, పప్పుల మంజుల, గంగిశెట్టి హరినాథ్, బిట్ల శేఖర్, కటకం రాములు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ
వరంగల్‌చౌరస్తా: పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్త కుటుంబాన్ని కాపాడుకుంటామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. అబ్బనికుంటకు చెందిన నల్ల చంద్రమౌళి ఇటీవల మృతి చెందాడు. ఎమ్మెల్యే శనివారం మృతుడి నివాసానికి వెళ్లి చంద్రమౌళి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 27వ డివిజన్ కార్పొరేటర్ అనిల్‌కుమార్, 18వ డివిజన్ కార్పొరేటర్ వస్కుల బాబు, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, డివిజన్ అధ్యక్షుడు పోలెపాక యాకూబ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.