భీమదేవరపల్లి, జూలై 17: గర్భిణులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని వంగర ప్రభుత్వ వైద్యాధికారి రుబీనా తెలిపారు. గురువారం వంగర ప్రభుత్వ దవాఖానలో గర్భిణులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆషాడం సందర్భంగా మహిళలు చేతులకు గోరింటాకు వేసుకోవడం పరిపాటి అన్నారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో మార్కెట్లో దొరికే కెమికల్ మెహందీ, హెయిర్ డై వంటి ప్రమాదకరమైన రసాయనాలతో కూడినవి వాడటం వల్ల చర్మ సంబంధ సమస్యలు, అలర్జీలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రతి ఒక్కరు సహజ సిద్ధమైన హెర్బల్ గోరింటాకునే వాడాలని సూచించారు. అనంతరం గర్భిణులు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు చేసుకోవాలని, తద్వారా ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వాణి, ఏఎన్ఎం స్వరూప, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.