హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 5 : సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేస్తున్న కాకతీయ విశ్వవిద్యాలయ ఉద్యోగి డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్‌ను కాకతీయ కీర్తి పురస్కారానికి ఎంపిక చేసినట్లు శ్రీశాంతి కృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శాంతిక్రిష్ణ ఆచార్య తెలిపారు. సంస్థ తరపున ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పలు సేవారంగాలలో విశేష కృషి చేస్తున్న తెలుగు వ్యక్తులను గుర్తించి పురస్కారాలు అందించడం జరుగుతుందన్నారు.
విష్ణువర్ధన్ కాకతీయ విశ్వవిద్యాలయంలో సుదీర్ఘకాలంగా ఉద్యోగిగా సేవలందిస్తూనే ప్రవృత్తిపరంగా పాత్రికేయునిగా ప్రజలకు ఉపయోగపడే అనేక అంశాలను ఉటంకిస్తూ పత్రికారంగంలో విశేష కృషి చేసిన వ్యక్తిగా, సామాజిక కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తూ, పాల్గొంటూ ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తున్న సామాజిక కార్యకర్తగా గుర్తించి పై పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు.
7న కాళోజీ కళాక్షేత్రంలో శ్రీశాంతి క్రిష్ణ సేవా సమితి 40వ వార్షిక వసంతోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ర్ట భాషా, సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో కాకతీయ కళావైభవం పేర నిర్వహించే 1112వ అంతర్జాతీయ వేదికలో ముఖ్యఅతిథుల సమక్షంలో విష్ణువర్ధన్‌కు కాకతీయ కీర్తి పురస్కారాన్ని ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. పురస్కారానికి ఎంపికైన విష్ణువర్ధన్‌ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.