భార్య దాష్టీకానికి భర్త బలయ్యాడు. ప్రేమించి పెళ్లాడిన భార్యే బరితెగించి వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్త చావును కళ్లజూసింది. సుపారీ ఇచ్చి మరీ ప్రియుడు, ఏఆర్ కానిస్టేబుల్‌తో హత్యకు స్కెచ్ వేసింది. గత నెల 20న భట్టుపల్లి శివారులో సుత్తితో తలపై విచక్షణరహితంగా దాడి చేయించగా తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడి శుక్రవారం అర్ధరాత్రి యువ వైద్యుడు సుమంత్‌రెడ్డి(37) తుది శ్వాస విడిచాడు. ఇప్పటికే నిందితులను పోలీసులు అరెస్టు చేయగా కఠినంగా శిక్షించాలని వైద్య సంఘాలు డిమాండ్ చేశాయి.
– వరంగల్ చౌరస్తా/కాజీపేట, మార్చి 1
ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ డాక్టర్ సు మంత్రెడ్డి శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య ఫ్లోరా తన ప్రియుడు శామ్యూల్‌తో కలిసి ఏఆర్ కానిస్టేబుల్ రాజు సహాయంతో గత నెల 20న రాత్రి ఉర్సు గుట్ట నుంచి భట్టుపల్లికి వెళ్లే రోడ్డులో సుమంత్‌రెడ్డి కారును అడ్డగించి హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇనుప రాడ్లతో దాడి చేయడంతో తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావంతో అపస్మారకస్థితిలో పడివున్న అతడిని స్థానికులు గుర్తించి వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.
సుమంత్‌రెడ్డి శరీరం చికిత్సకు స్పందించకపోవడంతో వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు గురువారం రాత్రి తిరిగి ఎంజీఎం ఆస్ప్రతికి తీసుకురాగా శుక్రవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. పంచనామా అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించగా కాజీపేట సిద్ధార్థనగర్‌లోని సొంత ఇంటికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న బంధువులు, మిత్రులు, స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున తరలివచ్చి పార్థివదేహం వద్ద నివాళులర్పించారు.
కాగా, సుమంత్‌రెడ్డి తల్లిదండ్రులు గాదె అసుంత మేరీ-సుధాకర్‌రెడ్డి 30 ఏళ్లుగా కాజీపేటలోని విష్ణుపురిలో నివాసం ఉండేవారు. ఏడేళ్లక్రితం సిద్ధార్థనగర్‌కు షిఫ్ట్ అయ్యారు. ప్రస్తుతం మృతుడు సుమంత్‌రెడ్డి భార్యతో కలిసి హనుమకొండ హంటర్ రోడ్డులో నివాసముంటూ విష్ణుపురిలో క్లినిక్ నడిపేవాడు. డాక్టర్, ఆయన కుటుంబం అందరితో కలుపుగోలుగా ఉండేవారని, ఎవరికీ హాని చేయరని ఆపద వస్తే ఆదుకునే కుటుంబమని అక్కడికి వచ్చిన వారు మాట్లాడుకోవడం కనిపించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇలాంటి ఘాతుకానికి పాల్పడడం దారుణమని, ఓ మంచి వైద్యుడిని కోల్పోయామంటూ చర్చించుకున్నారు. నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని పలు వైద్యుల సంఘాలు, అసోసియేషన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. కాగా, సుమంత్ రెడ్డి పార్ధివదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులు సంగారెడ్డికి తీసుకెళ్లగా కాజీపేట నుంచి అధిక సంఖ్యలో తరలివెళ్లారు.