నయీంనగర్, మే 29 : ల్యాండ్ పూలింగ్ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని ఆయన నివాసంలో ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామ రైతులతో ఆదివారం ల్యాండ్ పూలింగ్‌పై చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ దేశంలో రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్నది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కొంతమంది కావాలనే రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం రైతుల పొట్ట నింపే ప్రభుత్వమని, రైతుల పొట్టగొట్టే ప్రభుత్వంకాదని స్పష్టం చేశారు. రెండో రోజుల్లో రెండు జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, కూడా చైర్మన్, కమిషనర్‌తో సమావేశం నిర్వహించి ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు పూర్తిస్థాయిలో స్పష్టత ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రైతులు సంతోషం వ్యక్తం చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల నాయకులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.