హనుమకొండ చౌరస్తా : జిల్లాస్థాయిలో నిర్వహించే రాజ్యస్థరీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన ( Science Fair ) పోటీలను ఈనెల 18 నుంచి 20 వరకు హనుమకొండలో నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. వెంకట గిరిరాజ్ గౌడ్ ( DEO Giriraj Goud) తెలిపారు.
2024-25 సంవత్సరానికిగాను మంజూరైన ఇన్స్పైర్ మనక్ అవార్డుల ప్రాజెక్టు ప్రదర్శనలకు సంబంధించి మంజూరైన ప్రతి విద్యార్థిని ప్రదర్శన పోటీకి తప్పనిసరిగా హాజరుపర్చేందుకు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పూర్తి బాధ్యత వహించాలన్నారు. బాలవైజ్ఞానిక ప్రదర్శనకు ముందుగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ కేంద్రంలో రిపోర్టు చేయాలన్నారు.
ప్రతి పాఠశాల నుంచి బాలవైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనడం కోసం ప్రకటించిన ఏడు ఉప ఇతి వృత్తాలలో ఏవేని రెండు ఇతివృత్తాలకు సంబంధించి జూనియర్ విభాగం నుంచి ఇద్దరు, సీనియర్ విభాగం నుంచి ఇద్దరు విద్యార్థుల చొప్పున 4 ప్రదర్శనాంశాలకు అవకాశం ఉంటుందన్నారు. ఒక ప్రదర్శనకు ఒక విద్యార్థికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
సైన్స్ఫెయిర్ను విజయవంతం చేయడం కోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేసి సమన్వయం చేసేందుకు ఈనెల 15న హనుమకొండలో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నామని వివరించారు. జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రదర్శనతో పాటు రిజిస్ట్రేషన్ ఫారం, ప్రదర్శన పూర్తి నివేదిక (రైట్ అప్)ను రిజిస్ట్రేషన్ కేంద్రంలో ముందుగానే సమర్పించి గుర్తింపుకార్డును, ప్రదర్శన పత్రాన్ని పొంది కేటాయించిన గదిలో ప్రదర్శనను ఏర్పాటు చేసుకోవాలన్నారు.