గీసుగొండ, డిసెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తోపాటు అన్ని సంక్షేమ పథకాలు తెలంగాణలోని పేదలకు వరంగా మారాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ, సంగెం మండలాలతోపాటు గ్రేటర్ వరంగల్ 15, 16వ డివిజన్లలోని 20 మంది లబ్ధిదారులకు రూ. 20,02,320 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంగళవారం హనుమకొండలోని తన నివాసంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ధర్మారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి వారి సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అన్ని వర్గాల వారు అండగా ఉంటారని చెప్పారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారు అని కొనియాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గత పాలకులు తెలంగాణలోని రైతుల అభివృద్ధిని విస్మరిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను రాజులుగా మార్చేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే చల్లా అన్నారు. రాష్ర్టాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు వెన్నంటే ఉంటారన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అభివృద్ధే ధ్వేయంగా ఆయన పని చేస్తున్నారని కొనియాడారు. దళితబంధు పథకం ద్వారా దళితులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు విమర్శలు మాని అభివృద్ధిని చూడాలని హితవు పలికారు. అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రానున్న రోజుల్లో కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలకం కానున్నారని తెలిపారు. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు కావాలని కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో గీసుగొండ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, పార్టీ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, నాయకులు సుంకరి శివ, మహబూబ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.