హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 11: కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం(,Distance education) అందిస్తున్న డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్, ఓరియంటేషన్ కోర్సులలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు, అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ ప్రొఫెసర్ సురేష్లాల్ తెలిపారు. మొత్తం 59 కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు, డిగ్రీలో బీఏ, బీకాం (జనరల్, కంప్యూటర్స్), బీబీఏ, బీఎస్సీ, బీఎస్ఐఎస్సీ, పీజీలో ఎం.ఎ. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పోలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరి, రూరల్ డెవలప్మెంట్, సోసియాలజీ, హెచ్.ఆర్.ఎం., ఎం.కామ్., సోషల్ వర్క్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, ఎమెస్సీ సైకాలజీ, గణిత శాస్త్రం, ఎన్విరాన్ మెంటల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వృక్ష, జంతుశాస్త్రాలు, ఎంఎల్ఐఎస్సీ కోర్సులు ఉన్నాయన్నారు.
అలాగే మరో 9 డిప్లోమా కోర్సులు, 14 సర్టిఫికెట్ కోర్సులు, ఏడు ఓరియంటేషన్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు, ఈ విద్యా సంవత్సరానికి ఇదే చివరి గడువు కావున విద్యార్థులు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు. అర్హులైన అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటో జతచేసి, కోర్సు రుసుం ఆన్లైన్లోగాని దూరవిద్యా కేంద్రంలో క్యూఆర్ స్కాన్ ద్వారాగాని చెల్లించవచ్చని, కోర్సులు, ఫీజులు మరిన్ని వివరాల కోసం 0870-2461480, 2461490 నెంబర్లను సంప్రదించాలని కోరారు.