మహదేవపూర్(కాళేశ్వరం), మే 4: తెలంగాణకు జలభాండాగారమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నిన కుట్రలను పటాపంచలు చేసి ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు కాళేశ్వరం గోదావరి నది ఒడ్డున సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధూకర్ తెలిపారు.
శాసనమండలి బీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల సుమన్, నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, మాజీ జడ్పీ చైర్ పర్సన్లు జకు శ్రీహర్షిని, దావ వసంతతో పాటు సాగనీటి రంగ నిపుణుడు వీరమల్ల ప్రకాశ్ పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న కుట్రల గురించి కూలంకషంగా చర్చించనున్నట్లు తెలిపారు. ప్రజలు, మేధావులు, తెలంగాణవాదులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.