ఖిలావరంగల్, జనవరి 2: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామపంచాయతీలో తమను విలీనం చేయొద్దని డిమాండ్ చేస్తూ సేవాలాల్ సేన, లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పత్తినాయక్ తండావాసులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ సర్కారు, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్, హనుమకొండ జిల్లా సేవాలాల్ సేన అధ్యక్షుడు కునుసోతు మురళీనాయక్ మాట్లాడుతూ తండాల విలీనంతో గిరిజనుల రాజ్యాధికారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటున్నదని అన్నారు. నియోజకవర్గంలోని ఒక తండాను కూడా వదులుకోమన్నారు.
2000 మందితో గ్రామపంచాయతీగా ఉన్న పత్తినాయక్తండాను అమీనాబాద్ జీపీలో విలీనం చేసేందుకు గత డిసెంబర్ 31వ తేదీన కుట్రలకు తెరలేపారన్నారు. గ్రామ సభ పేరుతో ఎమ్మెల్యే సొంత గ్రామమైన అమీనాబాద్‌లో విలీనం చేసేందుకు పోలీసులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారన్నారు. అయితే పత్తినాయక్‌తండా ప్రజలు మాత్రం విలీనాన్ని తిరస్కరించారన్నారు. మా తండాలో మా రాజ్యం పేరుతో స్వయంపాలన కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే ప్రజాప్రతినిధుల స్వార్థం కోసం విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. విలీనాన్ని మానుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
అనంతరం కలెక్టర్ సత్య శారదకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణనాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు వాంకుడోత్ అశోక్‌నాయక్, నాయకులు ఇస్లావత్ వీరేందర్‌నాయక్, అఖిల్నాయక్, ఎల్పీహెచ్సీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్‌నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసునాయక్, జిల్లా అధ్యక్షుడు జగన్నాయక్, నర్సంపేట ఇన్చార్జి గుగులోత్ రామస్వామీనాయక్, నల్లబెల్లి మాజీ ఎంపీపీ సారంగపాణి, నెక్కొండ మాజీ ఎంపీపీ జాటోత్ రమేశ్, బోడ బద్దునాయక్, మాజీ సర్పంచ్ జాటోత్ స్వామి, బోడ మురళీనాయక్, శోభన్ పాల్గొన్నారు.