మహదేవపూర్ (కాళేశ్వరం), జూలై 6 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో ఆదివారం తొలి ఏకాదశి సందడి నెలకొంది. భక్తులు తెల్లవారుజాము నుంచే సమీపంలోని ఆలయాలకు చేరుకొని ఇష్ట దైవాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో కొలిచారు. భద్రకాళి, వేయిస్తంభాలు, ఐనవోలు, కాళేశ్వర ముక్తీశ్వర తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
మల్లికార్జునస్వామి, భ్రమరాంబికాదేవి ఆలయాల్లో ఆకేరు వాగు నుంచి కొత్త జలాలతో స్వామి వారికి అర్చకులు జలాభిషేకం చేశారు. కాళేశ్వరంలో ముందుగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలాచరించి నదీమ తల్లికి పూజలు చేశారు. అనంతరం కాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకొన్నారు. శుభానంద దేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.