పాలకుర్తి పర్యాటక సర్కిల్ అభివృద్ధి పనులు పడకేశాయి. పాల్కూరికి సోమనాథుడు, బమ్మెర పోతన వంటి ప్రముఖ కవుల జన్మస్థలం కావడంతో ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి సీఎం కేసీఆర్ పోతనా మాత్యుడి సమాధిని సందర్శించి నిధులు మంజూరు చేశారు. ఆ తర్వాత పనులు శరవేగంగా కొనసాగాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. దీంతో ఏడాదిన్నరగా పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటికైనా పర్యాటక పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని సాహితీ ప్రియులు కోరుతున్నారు. – పాలకుర్తి, జూన్ 24
ఏప్రిల్ 27, 2017లో సీఎం కేసీఆర్ బమ్మెర పోతనామాత్యుడి సమాధిని సందర్శించి పాలకుర్తి సోమనాథుడికి రూ.10 కోట్లు, పోతన స్మారక మందిరానికి రూ.7.50 కోట్లు, వల్మిడి ఆలయ అభివృద్ధికి రూ. 5 కోట్లు మంజూరు చేశారు. బమ్మెరలో పాలకుర్తి, వల్మిడి, బమ్మెర పర్యాటక అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఆనంతరం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో పర్యాటక పనులు శరవేగంగా ముందుకు సాగాయి. రూ. 2.5 కోట్ల వ్యయంతో బమ్మెరలో మహాకవి పోతన 22 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని రాజమహేంద్రవరం నుంచి తెప్పించి ప్రతిష్ఠించారు.
టూరిజం ప్యాకేజీలో భాగంగా బమ్మెర పర్యాటక అభివృద్ధికి కేటాయించిన రూ. 7.50 కోట్ల పనులు ఏడాదిగా నిలిచిపోయాయి. నిధులున్నా పనులు ముందుకు సాగడం లేదు. గతంలో మంజూరైన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని విడుదల చేయకపోవడంతో సం బంధిత కాంట్రాక్టు సంస్థ పనులు చేయలేమని చేతులెత్తేసింది. నవంబర్ 20న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పోతన అభివృద్ధి పనులు పరిశీలించి అధికారులతో సమీక్షించి పనులు పూర్తి చేస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదు.
బిల్లులు చెల్లిస్తానని కలెక్టర్ చెప్పినా కాంట్రాక్టర్ పనులు చేయలేనని చేతులెత్తేశాడు. పోతన సమాధి, పోతన మోట తోలిన బావి, లక్కమాంబ వాగు(కాల్వ), విద్యుత్, టైల్స్, ప్లాస్టింగ్, గార్డెన్ (గ్రీనరీ), ఓపెన్ థియేటర్, పార్కింగ్, ఆర్చి గేట్లు, 22 ఫీట్ల ఎత్తున పోతన కాంస్య విగ్రహానికి తుది మెరుగులు దిద్దడం, ఆర్ట్స్, క్రాఫ్ట్ భవనాల పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. పనులు పూర్తికాకపోవడం తో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కోణంలో పనులను పక్కనబెట్టిందని స్థానికులు మండిపడుతున్నారు.
ఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే ఆగిన పనులు
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి నిర్లక్ష్యం, అసమర్థతతోనే బమ్మెర పర్యాటక పనులు ఆగినయ్. కలెక్టర్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే పలు మార్లు సమీక్షలు నిర్వహించినా కాంగ్రెస్ ప్రభుత్వంలో బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్ చేతులెత్తేశా డు. ఎర్రబెల్లి దయాకర్రావు మంత్రిగా ఉన్నప్పుడు పనులు చురుగ్గా సాగాయి. తక్షణమే ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు స్పందించి పర్యాటక పనులు పూర్తి చేయాలి.
– జోగు గోపి, బమ్మెర గ్రామస్తుడు