నర్సంపేట, మే 10 : గ్రామ సభల ద్వారా గృహలక్ష్మి పథకం లబ్ధిదారులను గుర్తిస్తామని, నియోజవర్గానికి 7500 గృహాలు మంజూరు చేయిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గత ప్రభుత్వాల కాలంలో పూర్తికాని ఇళ్లు 1500 ఉన్నాయని, నియోజకవర్గానికి కొత్తగా 3వేల ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ నర్సంపేట నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా అదనంగా మరో 3వేల ఇళ్లు గృహలక్ష్మి పథకం ద్వారా కేటాయించాలని కోరామని చెప్పారు.
దీనిపై ప్రభుత్వం నుంచి లేఖ కూడా వచ్చిందని, మండలానికో అధికారిని నియమిస్తారని, ఆయన పర్యవేక్షణలో గ్రామ సభలను నిర్వహించి అర్హులను గుర్తిస్తామని పేర్కొన్నారు. మూడు వారాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామన్నారు. రూ.20 కోట్లతో ఎస్సీలకు రెండో విడుత పాడి గేదేలను పంపిణీ చేస్తామని చెప్పారు. 1000 యూనిట్లు పంపిణీ చేస్తామని, ఒక్కో యూనిట్లో రెండు పాడి గేదెలు అందిస్తామని తెలిపారు. ఎస్సీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పైలట్ ప్రాజెక్టు కింద వీటిని మంజూరు చేయించామని పేర్కొన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో రూ.350 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వేసవి లోపు బీటీ రోడ్డు పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
118 గ్రామాల్లో కనెక్టింగ్ రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయని, మొత్తం 294 గ్రామాల్లో ఈ పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. అభివృద్ధి పనులపై అక్కడక్కడ సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతున్నదని, ప్రతిపక్ష నాయకులు అవగాహన పెంచుకుని మాట్లాడాలని కోరారు. అభివృద్ధి, నిధుల విషయంలో నియోజకవర్గ నాయకులు స్పందించి సూచనలు, సలహాలు ఇవ్వొచ్చు అని పేర్కొన్నారు. కొత్తగా సుమారు 150 కిలోమీటర్లు బీటీ, సీసీ రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
కొనసాగుతున్న సప్తదశ బ్రహ్మోత్సవాలు
దుగ్గొండి : కేశవాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో సప్తదశ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నా లుగో రోజు హనుమద్వాహన సేవా ఉత్సవాన్ని నిర్వహించారు. అర్చకుడు ప్రదీప్స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు ఆలయ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి-పూలమ్మ దంపతులు, కంది జితేందర్‌రెడ్డి స్వాగతం పలికారు.
సమాజహితానికి ఆలయాలు దోహదం..
సమాజహితానికి ఆలయాలు ఎంతగానో దోహదం చేస్తాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సొంత ఖర్చులతో గ్రామంలో ఆలయాన్ని నిర్మించిన కంది జితేందర్‌రెడ్డి-సరళ దంపతులను అభినందించారు. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో ఉంటేనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యేను జితేందర్‌రెడ్డి, వేదపండితులు శాలువాతో సత్కరించి ప్రసాదాలు అందించారు. వేడుకల్లో అర్చకులు నర్సింహాచారి, రామస్వామి, సాగర్స్వామి, ఆలయ కార్య నిర్వాహకుడు ముత్యాల కిరణ్‌కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, కాట్ల భద్రయ్య, సర్పంచ్ రేవూరి నారాయణరెడ్డి ఎంపీటీసీ మామునూరు సుమన్, మేరుగు రాంబాబు, బొంత సాయి, గ్రామ పెద్దలు కంది మోహన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రాజయ్య, అశోక్ పాల్గొన్నారు.