నల్లబెల్లి, సెప్టెంబర్ 19: ప్రజల అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రంగాపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం నర్సంపేట క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చలువతో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాని తెలిపారు. తనను గెలిపించిన ఆరు మండలాల ప్రజలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటానన్నారు.
సంక్షేమ పథకాల అమలుతో ప్రతిపక్ష నాయకుల గుండెల్లో గుబులు రేకెత్తుతున్నదని, ఏం చేయాలో తోచక రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల పరిస్థితిని చూసి జాలి వేస్తున్నదని, ఈ రెండు పార్టీల అగ్ర నాయకులకు నియోజకవర్గంలో చోటు లేదంటూ ఆ పార్టీ కార్యకర్తలే వాల్ పోస్టర్లు వేయడం, ప్రకటనలు చేయడం చూస్తుంటే వారికి ప్రజల్లో ఏ స్థానం ఉందో ఆర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎదుగుదలను జీర్ణించుకోలేని వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేయడం వారి నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, సర్పంచ్ చీకటి ప్రకాశ్, ఎంపీటీసీ రవీందర్రావు, మాజీ సర్పంచ్ రాంబాబు పాల్గొన్నారు.
సీఎం నాయకత్వంలోనే అభివృద్ధి..
చెన్నారావుపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. మండలంలోని కోనాపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ గుండాల మహేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో సుస్థిర పాలన కొనసాగుతున్నదని, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కోనాపురం గ్రామానికి గత పాలకుల కంటే అధిక నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేశామని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, ఎంపీటీసీ ధరావత్ శ్రీను, రైతు బంధు సమితి గ్రామ కన్వీనర్ బాణాపురం రాజేందర్, అమీనాబాద్ పీఏసీఎస్ డైరెక్టర్ అనుముల రవి తదితరులు పాల్గొన్నారు.
ఆది దేవుడికి ఎమ్మెల్యే దంపతుల పూజలు..
నర్సంపేట: క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకల్లో ఎమ్మెల్యే పెద్ది, స్వప్న దంపతులు గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.