వరంగల్, అక్టోబర్ 13 : గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి అనధికారికంగా చేపట్టిన నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణలో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు కూల్చివేస్తున్నాయి. గురువారం టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆదేశాల మేరకు వరంగల్ ప్రాంతంలో 3, హనుమకొండ ప్రాంతంలో 3 నిర్మాణాలను కూల్చివేశారు. అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని ఎస్ఆర్ఆర్ తోటలో అనధికారికంగా నిర్మించిన కాంపౌండ్ వాల్, గదిని ఎన్ఫోర్స్మెంట్ బృందాలు కూల్చివేశాయి.
ఉర్సు దర్గా ఎదురుగా అనుమతి లేకుండా నిర్మించిన రెండో అంతస్తు, జీ ప్లస్-2 భవనంలోని అనధికార నిర్మాణాలను కూల్చివేశారు. హనుమకొండలోని వడ్డేపల్లి ప్రశాంత్ కాలనీలోని జేకే టవర్స్ అపార్ట్మెంట్ వద్ద అనధికారికంగా నిర్మించిన పెంట్ హౌస్‌ను తొలగించారు. రెవెన్యూ కాలనీలో కాంపౌండ్ వాల్, సింగిల్ రూం, 2వ డివిజన్ పరిధిలోని వంగపహాడ్ బస్టాండ్ వద్ద నిర్మించిన కాంపౌండ్ వాల్, షెడ్‌ను బృందాలు తొలగించాయి. ఈ సందర్భంగా బల్దియా డిప్యూటీ సిటీ ప్లానర్ ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఎస్ బీపాస్ అనుమతులు లేకుండా, అనుమతుల ప్రకారం నిర్మాణం చేయకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టీఎస్ బీపాస్ అనుమతుల ప్రకారమే భవనాలు నిర్మించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కూల్చివేస్తామని హెచ్చరించారు. గ్రేటర్ కార్పొరేషన్, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, పోలీసు అధికారుల పర్యవేక్షణలో కూల్చివేతలు చేపట్టారు.