కాంగ్రెస్ సర్కారు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే వేల ఉద్యోగాలు భర్తీ చేశామని గొప్పలు చెప్పుకొంటున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నియామకాల ప్రక్రియ పూర్తికాగా, కేవలం ఉత్తర్వులు అందజేసి తమ ఘనతగా చాటుకుంటున్నది. ఇందులో భాగంగా నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్)లో చేపట్టిన ఉద్యోగాల భర్తీలో మాత్రం జాప్యం చేస్తున్నది. 2023లో 94 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ (జేఏసీసీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షలు జరిగి ఫలితాలు సైతం వెల్లడి కాగా, నాలుగు నెలల క్రితం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యింది. అప్పటి నుంచి నియామక ఉత్తర్వులు అందించకపోవడంతో ఎంపికైన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఏడాదిన్నరగా జేఏసీసీవో పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండడం పలు అనుమానాలకు తావిస్తున్నది. అయితే ఈ నియామకాలు చేపడితే సిబ్బంది కొరతతో ఉద్యోగులపై పడిన పనిభారం, ఒత్తిడి తగ్గుతుందనే అభిప్రాయం సంస్థ ఉద్యోగుల నుంచే వ్యక్తమవుతున్నది.
– హనుమకొండ, జనవరి 9
టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ (జేఏసీసీవో) పోస్టుల భర్తీ విషయంలో జరుగుతున్న జాప్యంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. నోటిఫికేషన్‌కు అనుగుణంగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, పరీక్షలు నిర్వహించిన ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఫలితాల వెల్లడిలో ఆల స్యం చేసింది. అయితే ఇందుకు సంబంధించిన కేసు కోర్టులో ఉండడంతోనే జాప్యం జరిగిందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తంమీద గత ఏడాది ఆగస్టు 1న ఫలితాలు విడుదల చేసిన యాజమాన్యం సర్టిఫికెట్ల పరిశీనలను సైతం పూర్తి చేసింది.
ఇదంతా జరి గి సుమారు నాలుగు నెలలు దాటుతున్నప్పటికీ ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం చుట్టూ ఎంపికైన అభ్యర్థులు తిరుగుతున్నారు. అయినప్పటికీ అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని, దీని వెనుక ఆంతర్యం ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. తమను రోజుల తరబడి తిప్పించుకోవడంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నియామక ఉత్తర్వులు జారీ చేయడంపై ప్రభుత్వ పెద్దలు, సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పునర్విభజనతో పెరిగిన ఒత్తిడి
కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో టీజీఎన్పీడీసీఎల్ సర్కిళ్లు, డివిజన్లు, సబ్ డివిజన్లను పునర్విభజన చేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. దీంతో వారినే సర్దుబాటు చేయడంతో వారిపై పని ఒత్తిడి పెరిగిందని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే జేఏసీసీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో వెంటనే ప్రక్రియ పూర్తయితే పనిభా రం తగ్గుతుందని అనుకున్నామంటూ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో ఉత్తర్వులిస్తాం
టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో ఎంపికైన జేఏసీసీవో పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు త్వరలో నియామక ఉత్తర్వులు అందజేస్తాం. కోర్టు కేసు నేపథ్యంలో మొత్తం వంద పోస్టుల్లో ఆరింటిని మినహాయించి మిగిలిన 94 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాం. 2023 జూన్ 4న రాత పరీక్ష నిర్వహించి కోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే గత ఏడాది ఆగస్టు 1న ఫలితాలు వెల్లడించాం. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను కూడా పూర్తి చేశాం. త్వరలోనే నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నాం. -కర్నాటి వరుణ్‌రెడ్డి, సీఎండీ, టీజీఎన్పీడీసీఎల్