హనుమకొండ : మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నా రని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ ( Dasyam Vinay Bhaskar ) ఆరోపించారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోక పోవడం వల్ల రైతులు ఆత్మహత్యల వైపు పయనిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) చంద్రబాబు ( Chandra babu ) డైరెక్షన్లో నడుస్తున్నారని విమర్శించారు.సమైక్య పాలనలో ఎరువులు, విత్తనాలు, కరెంటు కోతలతో రైతులు ఆత్మహత్యలు చేసుకోగా నేడు కాంగ్రెస్ పాలనలో అదే పరిస్థితిని ఎదుర్కొంటు న్నారని వెల్లడించారు.
కేసీఆర్ పాలనలో రైతులకు రైతు బంధు, 24 గంటల కరెంటు, విత్తనాలు, మిషన్ కాకతీయ, ప్రాజెక్టులు కట్టి సాగునీరు అందించి రైతును రాజు చేశారని తెలిపారు. కాంగ్రెస్ 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి రాగా ఈ రెండున్నరేళ్లలో రైతుల పంటలు కొనలేదు. బోనస్ బోగస్ అయ్యిందని ఎద్దేవా చేశారు. రేవంత్ ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాడుతామని తెలిపారు.
22న కేటీఆర్ రాక
మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ మాట్లాడుతూ ఈనెల 22న వర్ధన్నపేట నియోజకవర్గ బీఎల్ఏలు, సభ్యత్వ నమోదు, సోషల్ మీడియా ప్రతినిధులు 2 వేల మందికి ఒక రోజు శిక్షణ తరగతుల కార్యక్రమానికి కేటీఆర్ రానున్నారని తెలిపారు. కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.రేవంత్ రెడ్డి 70 సార్లు ఢిల్లీ వెళ్లి తెలంగాణకు తెచ్చింది ఏమీ లేదని విమర్శించారు. రైతు రుణ విమోచన కమిషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.