Diseases | యువకుల్లో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం సాధారణంగా కనిపించే విషయం. ఇప్పుడేం కాదు, తర్వాత చూసుకుంటాం అనే భావనతో చాలామంది తమ ఆహారం, నిద్ర, ఒత్తిడి వంటి అంశాలను పట్టించుకోరు. అయితే 20 ఏళ్ల వయస్సులో చేసే చిన్న చిన్న తప్పులు 40 ఏళ్లకు చేరుకునే సమయానికి పెద్ద ఆరోగ్య సమస్యలుగా మారే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ ఆరోగ్యం, శక్తి స్థాయిలు, మానసిక ఆరోగ్యం, జీవక్రియలపై ఈ అలవాట్లు దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం శరీరంలోని అనేక కీలక వ్యవస్థలకు పునాది వంటిదని నిపుణులు పేర్కొంటున్నారు. శక్తి, మానసిక స్థితి, చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, ఏకాగ్రత వంటి అంశాలు కూడా పేగుల ఆరోగ్యంతో ముడిపడి ఉంటాయి. అందువల్ల చిన్న వయస్సు నుంచే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడం అవసరం.
నిద్ర విషయంలో చాలామంది చేసే పొరపాటు రాత్రిళ్లు తక్కువగా నిద్రపోయి, తర్వాత ఎప్పుడో ఆ లోటును పూడ్చుకోవచ్చని భావించడం. అయితే కోల్పోయిన నిద్రను పూర్తిగా తిరిగి పొందడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. నిరంతరం నిద్రలేమితో బాధపడటం జీవసంబంధ వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు జీవక్రియ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక ఒత్తిడి కూడా శరీరానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి పేగుల పనితీరుపై ప్రభావం చూపడమే కాకుండా మొత్తం శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒత్తిడిని నియంత్రించేందుకు ధ్యానం, యోగా, వ్యాయామం వంటి పద్ధతులు ఉపయోగపడతాయి. 20 ఏళ్ల వయస్సులో తీసుకునే ఆహారపు అలవాట్లు భవిష్యత్తులో ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు ఒక్కసారిగా రావు. సంవత్సరాల పాటు కొనసాగిన అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ఫలితంగా అవి నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి.
పీచు పదార్థాలు (ఫైబర్) తగిన మోతాదులో తీసుకోకపోవడం కూడా ఒక ప్రధాన సమస్యగా నిపుణులు గుర్తిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది రోజుకు అవసరమైన దానికంటే చాలా తక్కువ ఫైబర్ మాత్రమే తీసుకుంటున్నారు. ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు గుండె జబ్బులు, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 20 ఏళ్ల వయస్సులోనే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. సమతుల ఆహారం, తగిన నిద్ర, ఒత్తిడి నియంత్రణ, క్రమం తప్పకుండా వ్యాయామం, పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లు దీర్ఘకాలిక ఆరోగ్యానికి బలమైన పునాదిగా నిలుస్తాయి.