చిన్నగూడూరు, జులై 16 : ఈ నెల 22న చిన్నగూడూరులో నిర్వహించనున్న దాశరథి కృష్ణమాచార్యుల శతజయంతి వేడుకలకు పార్టీలకతీతంగా హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు కోరారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలోని దాశరథి సోదరుల విగ్రహాలను పరిశీలించారు. అనంతరం కృష్ణమాచార్యుల శతజయంతి వేడుకల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజల దుస్థితిని చూసి చలించిపోయిన కృష్ణమాచార్యులు తన కలంతో జాగృతం చేశాడన్నారు. శతజయంతి ప్రారంభ కార్యక్రమానికి కవులు, గాయకులు నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్ (ఎమ్మెల్సీ), డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రూనాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే, ఎంపీలు మురళీనాయక్, బలరామ్ నాయక్, ఎమ్మెల్సీ సత్యావతిరాథోడ్, టీఎన్జీవో పూర్వ అధ్యక్షుడు దేవీప్రసాద్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడు విరాహత్ అలీ హాజరవుతారని తెలిపారు.
వేడుకల అనంతరం మండల కేంద్రం నుంచి మహబూబాబాద్‌కు భారీ బైక్ ర్యాలీ ఉంటుందన్నారు. ఎస్వీ ఫంక్షన్ హాలులో కవులు, గాయకులు, దాశరథి అభిమానులు, ప్రజా ప్రతినిధులతో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జయంతి ఉత్సవాల కమిటీని గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గునిగంటి కమలాక ర్, సభ్యులుగా సత్యనారాయణ, బ్రహ్మం, లక్ష్మణ్, మో హన్, శంకరయ్య, నర్సయ్య, అనిల్, సురేశ్, సోమన్న తదితరులు ఎన్నికయ్యారు. సమావేశంలో మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, కౌన్సిలర్ వేణు, వైస్ ఎంపీపీ వీరన్న, నాయకులు ప్రమోద్‌రెడ్డి, కన్నా, మడత వెంకన్న తదితరులు పాల్గొన్నారు.