మహబూబాబాద్ రూరల్, జూలై 22 : మానుకోట గడ్డ మీద పుట్టిన దాశరథి కృష్ణాచార్యులు తెలంగాణ సమాజానికి చేసిన సేవలు మరువలేనివని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రూనాయక్ అన్నారు. సోమవారం మహబూబాబాద్ పట్టణంలోని ఎస్వీఎం ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ఆధ్వర్యంలో దాశరథి శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన గొప్ప పోరాట యోధుడు దాశరథి అని, ఆయన మానుకోట గడ్డ మీద పుట్టడం మనందరికీ గర్వకారణమన్నారు. తన అక్షర శరాలతో నిజాం రాజును గడగడలాడించిన ధీశాలి అని కొనియాడారు.
ఎమ్మెల్సీ, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అన్న దాశరథి కృష్ణామాచార్యులు నేటి యువతకు ఆదర్శమన్నారు. సాహిత్య రంగానికి ఆయన ఎనలేని సేవలు చేశారని, తన రచనలతో జీవచ్చవంలా బతుకుతున్న తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపిన మహనీయుడని అన్నారు. మారుమూల ప్రాంతంలో పుట్టి న దాశరథి సాహిత్య రంగానికి చేసిన సేవతోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని అన్నారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినందుకు అనేకమార్లు జైలు జీవితాన్ని గడిపారన్నారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. చిన్నగూడూరులో పుట్టి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న దాశరథి కృష్ణామాచార్యులకు కృషి, పట్టుదలకు మారుపేరని అన్నారు. ఆ మహనీయుడి స్ఫూర్తితో నేడు ఎంతో మంది ఉన్నత శిఖరాలను అధిరోహించినట్లు చెప్పా రు.
నిరంతర కఠోర దీక్షతో తాను అనుకున్నది సాధించేవారని అన్నారు. దాశరథి కవితలు, రచనలు ఎంతోమందిని చైతన్యవంతం చేశాయన్నారు. దాశరథి సేవలను మరింత విస్తరించేలా ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని, పట్టణంలో ఆడిటోరియం, స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమి తొలి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. నిరంతరం పేదల సమస్యలపై ఉద్యమిస్తూ, నిజాం నిరంకుశత్వానికి తన అక్షరాలతో ఎదురొడ్డి నిలిచిన గొప్పవ్యక్తి దాశరథి అని అన్నారు. రజాకార్లు తీవ్రంగా హింసించినా తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేదని, తన కవితలు, రచనలతో ప్రజలను చైతన్యవంతం చేసినట్లు తెలిపారు. టీఎన్జీవోస్ నాయకుడు దేవీప్రసాద్, టీయూడబ్ల్యూ (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ మాట్లాడుతూ.. దాశరథి పోరా ట పటిమ, సాహిత్య రచనలను యువత ముం దుకు తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి, మార్నేని వెంకన్న, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కవులు, రచయితలుపాల్గొన్నారు.