నల్లబెల్లి, జూన్ 10 : కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే ఏజెన్సీ భూములకు కరెంట్ ఇస్తామని ఆ పార్టీ చోటా మోటా లీడర్లు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. బోర్ కనెక్షన్ కోసం డబ్బులివ్వాలంటూ రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే రూ. 2.80 లక్షలు వసూలు చేసిన వారు సొంత పార్టీ నేతలనూ వదలడం లేదు. ఇందుకు సంబంధించిన పోస్ట్ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా మారింది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలంలోని ఆసరవెల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ గుండెబోయిన సాంబయ్య ఆరోపణ మేరకు వివరాలిలా ఉన్నాయి. కేసిఆర్ ప్రభుత్వం మండలంలోని ఏజెన్సీ గ్రామాలకు పోడు పట్టాలు పంపిణీ చేసింది. ఈ భూములకు కరెంట్ సరఫరా చేసి రైతులు బో ర్లు వేసుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అనుమతి ఇచ్చారు. ఇదే అదనుగా బావించిన మేడెపల్లి గ్రామ కాంగ్రెస్ ఎంపీటీసీ భర్త మోహన్‌తోపాటు ఆసరవెల్లి, మేడెపెల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు జనగాం రాజు, వంగర వెంకన్న, కార్యదర్శి ఆవుల ఐలయ్య బోరు వాహనాల ఏజెంట్ల నుంచి రూ. 2.80 లక్షలు కమీషన్‌గా తీసుకుని తలా రూ. 77 వేలు పంచుకున్నారు. అంతేగాక పోడు పట్టాలు పొందిన 490 మంది రైతులు 9 ట్రాన్స్పార్మర్ల కోసం డీడీలు తీయగా, ఇటీవల కాంట్రాక్టర్ విద్యుత్తు స్తంభాలు తీసుకువచ్చాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న రైతులకే కరెంటు ఇస్తామని, అలాగే తమకు ప్రతి రైతూ కమీషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దీనికి రైతులు ససేమిరా అనడంతో విద్యుత్ కాంట్రాక్టర్, ఫారెస్ట్ అధికారులను బెదిరింపులకు గురి చేసి స్తంభాలను తిరిగి పంపించారు. అయితే కాంగ్రెస్ ముసుగులో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వీరి బాగోతాన్ని ముఖ్య నాయకులకు తెలిపినా పట్టించుకోక పోవడంతో తానే వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశానని మాజీ ఉప సర్పంచ్ మంజుల-సాంబయ్య తెలుపడం విశేషం.