హనుమకొండ/వరంగల్/ఖిలా వరంగల్/హనుమకొండ చౌరస్తా/పోచమ్మమైదాన్, మే 20 : మన సంస్కృతీసంప్రదాయాలు, వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని కాకతీయుల 22వ వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ కాకతీయ పేర్కొన్నారు. మంగళవారం ఓరుగల్లు పర్యటనలో భాగంగా హనుమకొండ నక్కలగుట్టలోని హరిత హోటల్లో ప్రజలతో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ప్రపంచానికి విజ్ఞానాన్ని, సంప్రదాయాలను, సం సృతిని పరిచయం చేసిన మహోన్నత దేశం భారతదేశమని అన్నారు. ప్రపంచ దేశాలకు భాష, లిపి లేనప్పుడే మనం గుళ్లు కట్టడంతో పాటు భాషను, లిపిని కొనసాగించామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చిన్నారులకు మన వారసత్వ సంపద, చరిత్రను పరిచయం చేయాల్సిన అవసరం ఉన్నదని చె ప్పారు. ఓరుగల్లులో నిర్మించనున్న విమానాశ్రయానికి రాణీ రుద్రమదేవి పేరు పెట్టాలని గతంలోనే ప్రధాని నరేంద్రమోదీని కోరినట్టు ఆయన గుర్తుచేశారు.
అలాగే కాకతీయుల సంపదైన కోహినూరు వజ్రాన్ని సైతం బ్రిటన్ నుంచి తెప్పించాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. అక్కడినుంచి వడ్డేపల్లిలో ని పోచమ్మ ఆలయం, శివాలయంలో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ఇంట్లో భోజనం చేసి బస్తర్ బయల్దేరారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్, టార్చ్ సంస్థ వ్యవస్థాపకు డు ఆరవింద్ ఆ ర్య పకిడే, బీఆర్ఎస్ నాయకులు సంపతి రఘు, జానకీరాములు, డివిజన్ ప్రెసిడెం ట్లు, సేవా టూరి జం కల్చరల్ సొసైటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుసుమ సూర్యకిరణ్ పాల్గొన్నారు.
ఆలయాల పునర్నిర్మాణానికి ప్రభుత్వాలు కృషి చేయాలి
వేయి స్తంభాల రుద్రేశ్వర ఆలయానికి రావ డం ఇది రెండోసారి అని, హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ నుంచి అహోబిలం క్షేత్రం అటు తమిళనాడు, కర్ణాటక వరకు తమ పూర్వీకులు అనేక ఆలయాలను అద్భుతంగా నిర్మించారని వాటి పునర్నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కమల్‌చంద్ర భంజ్‌దేవ్ అన్నారు. ఓరుగల్లు పర్యటనలో భాగంగా ఆయన వేయిస్తంభాల ఆలయం, భద్రకాళీ ఆలయం, వరంగల్ కోట, మధ్యకోటలోని స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయాలను మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్‌తో కలిసి సందర్శించారు.
వేయిస్తంభాల ఆలయంలో ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ స్వాగతం పలికి కాకతీయుల కాలం నాటి ఉత్తిష్ఠ గణపతికి పూజ, రుద్రేశ్వరస్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించారు. నాట్యమండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు శేషవస్త్రాలు అందజేసి, వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ప్రాశస్త్యాన్ని అరవింద్ వివరించారు. అనంతరం భద్రకాళీ ఆలయంలో ఈవోలు శేషుభారతి, ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషులు ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ ఘనంగా సతరించారు. అలాగే వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్లోని రాణీ రుద్రమదేవి విగ్రహానికి నమస్కరించి పూలమాల వేశారు.