కమ్యూనిస్టులను లేకుండా చేసేందుకే కగార్ ఆపరేషన్
ట్రంప్ చేతిలో కీలు బొమ్మ మోడీ
కార్పొరేట్ శక్తుల కోసం తలసరి ఆదాయంపై కేంద్రం తప్పుడు లెక్కలు
కృత్రిమంగా పేదలు లేని దేశంగా చూడాలని కుట్ర
విలేకరుల సమావేశంలో ఎమ్మెలే కూనంనేని సాంబశివరావు
Kunamneni Sambashiva Rao | హనుమకొండ, జూన్ 14 : దేశంలో, రాష్ట్రంలో గతంలో ఎన్నడు లేనివిధంగా సంక్షోభ పరిస్థితులు కనబడుతున్నాయని, దాన్ని కవర్ చేసేందుకు ప్రభుత్వాలు అనేక మాటలు మాట్లాడుతున్నాయని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకాతీయ హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని, ఆపరేషన్ కగార్ పేరుతో కమ్యూనిస్టులను లేకుండా చేయాలని కలలు కంటుందని విమర్శించారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పడం ఒక ఫ్యూడల్, గూండా, ఫాసిస్టు, రాక్షస పాలనకు నిదర్శనం అని అన్నారు. ప్రశ్నించేవారంటే మోదీకి భయమని, కమ్యునిస్టులంటే మరింత భయం అని ఎద్దెవా చేశారు. కమ్యూనిస్టుల మృతదేహాలను చూసి కేంద్రం భయపడుతోందని, పోలీసుల కాల్పుల్లో చనిపోయిన నంబాల కేశవరావు మృతదేహాన్ని ఇవ్వకపోవడం దారుణమని అన్నారు.
మావోయిస్టులు తప్పు చేస్తే చట్టప్రకారం కేసులు పెట్టాలని సూచించారు మావోయిస్టులు లొంగిపోతామన్నా, చర్చలకు సిద్దం అని ప్రకటించినా హతమార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. కానీ ఒక్క నంబాల కేశవరావును చంపితే దేశంలో కోట్లాది మంది స్పందించారని, అదీ కమ్యూనిస్టులకు ఉన్న మానవతావాదానికి నిదర్శనం అని అన్నారు. భారతదేశం ఆర్ధికంగా జపాన్ను దాటి నాల్గవ స్థానం ఆక్రమించిందని కేంద్ర సర్కార్ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతుందని, కృత్రిమంగా పేదలు లేని దేశంగా చూపాలని ప్రయత్నిస్తునందని సాంబశివరావు విమర్శించారు. అర్థికంగా దేశం అభివృద్ధి చెందితే అసమానతలు ఎందుకు పోలేదని, ప్రజలు పేదరికంలో ఎందుకు మగ్గుతున్నారని ప్రశ్నించారు. ప్రతిరోజు రూ.280ల నుండి రూ.320లు సంపాదిస్తే పేదలు ధనవంతులుగా ఎలా మారుతారన్నారు. నెలకు రూ. 20వేల ఆదాయం ఉన్నా పేదవాడిగానే పరిగణించాలన్నారు. బతుకుదెరువు లేకుండా అర్థాకలితో ప్రజలు జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రపంచ దేశాలో ఆకలితో అలమటిస్తున్నవారిలో దేశం 101 స్థానంలో నిలిచిందని, ప్రజలకు విద్య, వైద్యం కల్పించటంలో, కొనుగోలు శక్తిలో 124 స్థానంలో నిలిచినట్లు సూచికలు తెలుపుతున్నాయని పేర్కొన్నారు.
కేంద్రం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, వాస్తవాలను మరుగునపడేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ట్రంప్ చేతిలో మోడీ కీలుబొమ్మ అని, అమెరికా ఏది చెపితే అది చేస్తున్నారన్నారు. కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల సంబరాలను జాతీయ స్థాయిలో వచ్చే డిసెంబర్ 26వ తేదీన ఖమ్మంలో 5లక్షల మందితో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మా సూచనలు సలహాలు చేస్తామని, అయినప్పటికి మా విధానం మాదే అంటే వారి కర్మకు వారే బాధ్యులవుతారన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఎపుడు ప్రజల పక్షాన్నే నిలుస్తుందన్నారు. హనుమకొండ, వరంగల్లో వేలాది మంది నిరుపేదలు గుడిసెలు వేసుకొన్ని ఉన్నారని, వారికి పట్టాలు ఇచ్చి క్రమబద్దీకరించాలని, రాష్ట్రంలో అర్హులైన వారందరిని పార్టీలకు అతీతంగా, పారదర్శకంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
ఎమ్మెల్య కూనంనేని సాంబశివ రావు జన్మదినం సందర్బంగా సిపిఐ నేతల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, మాజీ జిల్లా కార్యదర్శి సిరబోయిన కరుణాకర్, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.